Virat Kohli: విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో బాబర్ అజామ్, పాక్ కెప్టెన్‌కి యూనిస్ ఖాన్ మొట్టికాయలు
Babar Azam: బాబర్ అజామ్ కెప్టెన్సీ ఇప్పుడు ప్రమాదంలో పడింది. గత కొన్ని నెలలుగా పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ అజామ్‌కి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడు.
పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్ బాబర్ అజామ్ తన కెరీర్‌లోనే ఇప్పుడు అత్యంత క్లిష్ట దశని ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గానే కాదు బ్యాటర్‌గానూ వరుసగా విఫలమవుతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో బబార్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క హాఫ్ సెంచరీని కూడా నమోదు చేయలేకపోయాడు. దాంతో సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ టీమ్ 0-2 తేడాతో అత్యంత అవమానకరరీతిలో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లోనూ బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ టీమ్ గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది.
ప్రమాదంలో బాబర్ కెప్టెన్సీ
బాబర్ అజామ్ పేలవ ఫామ్‌పై అటు అభిమానులు, ఇటు మాజీ ఆటగాళ్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫామ్ కోల్పోయి జట్టు ఓటమికి కారణమవుతున్న బాబర్‌ను వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పించాలని కూడా చాలా మంది సూచిస్తున్నారు.
2009లో పాకిస్థాన్‌ను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కూడా బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సూచించారు.
2019లో బాబర్ అజామ్ బ్యాటింగ్ ప్రదర్శనను చూసి కెప్టెన్‌గా నియమించారని, ఇప్పుడు అతను తన ఆటపై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చిందని యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. బాబర్ మళ్లీ ఫామ్ అందుకోవాలంటే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటేనే మంచిదని యూనిస్ ఖాన్ సూచించాడు.
‘‘బాబర్ అజామ్‌కి నేను ఇచ్చే సలహా ఒక్కటే. అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి. 2019లో బాబర్ అజామ్ అత్యుత్తమ ఆటగాడు. కాబట్టే అతడ్ని కెప్టెన్‌గా నియమించారు. జట్టులోని అత్యుత్తమ ఆటగాడు కెప్టెన్‌గా ఉండాలని అప్పట్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను’’ అని యూనిస్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి
విరాట్ కోహ్లీ నుంచి బాబర్ అజామ్ పాఠాలు నేర్చుకోవాలని యూనిస్ ఖాన్ సూచించాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోవడంపై ఎలా దృష్టి పెట్టాడో గమనించాలని బాబర్‌కి సూచించాడు.
‘‘కెప్టెన్సీ అనేది చాలా చిన్న విషయం. ప్లేయర్స్‌కి పెర్ఫామెన్స్ ముఖ్యం. విరాట్ కోహ్లీని చూడండి.. తనంతట తానుగా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఏ ప్లేయరైనా దేశం కోసం ఆడటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే వ్యక్తిగత రికార్డులు’’ అని యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ చాలా చిన్న వయసులోనే ఎంతో సాధించాడని కితాబిచ్చాడు.
ఆట తక్కువ.. మాటలు ఎక్కువ
పాకిస్థాన్‌లోని క్రికెటర్లు మైదానంలో ప్రదర్శన కంటే.. వెలుపల ఎక్కువగా మాట్లాడటాన్ని తాను గమనించానని యూనిస్ ఖాన్ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత బాబర్ అజామ్, షాహిన్ షా అఫ్రిది మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. జట్టులోని ఆటగాళ్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్ గడ్డపై వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్ ఛాంపియన్స్ కప్‌లో బాబర్ అజామ్ ఆడబోతున్నాడు.