Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకి ఊహించని శుభవార్త.. రీఎంట్రీ ఇవ్వబోతున్న ఫాస్ట్ బౌలర్-fast bowler mohammed shami may fly to australia if he meets bcci conditions ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకి ఊహించని శుభవార్త.. రీఎంట్రీ ఇవ్వబోతున్న ఫాస్ట్ బౌలర్

Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకి ఊహించని శుభవార్త.. రీఎంట్రీ ఇవ్వబోతున్న ఫాస్ట్ బౌలర్

Galeti Rajendra HT Telugu
Nov 14, 2024 10:38 PM IST

India tour of Australia 2024: ఆస్ట్రేలియా టూర్‌కి ఇప్పటికే భారత్ జట్టు వెళ్లిపోయింది. కానీ.. ఏదో లోటు.. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి సపోర్ట్ ఇచ్చే పేసర్ టీమ్‌లో లేడని అభిమానులు బాధపడుతున్నారు. కానీ.. ఆ లోటు తీరబోతోంది.

మహ్మద్ షమీ
మహ్మద్ షమీ (HT_PRINT)

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత్ జట్టుకి ఉత్సాహానిచ్చే వార్త. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించాడు. గురువారం రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ.. తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు.

రీఎంట్రీలో 4 వికెట్లు పడగొట్టిన షమీ

గాయాల కారణంగా దాదాపు ఏడాదికి పైగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ఈ పేసర్.. గురువారం రంజీ మ్యాచ్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ఆడిన షమీ.. పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు. అతను కేవలం 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. వేసిన 19 ఓవర్లలో 4 మెయిడిన్ కావడం విశేషం.

మధ్యప్రదేశ్ కెప్టెన్ శుభమ్ శర్మ, ఆల్ రౌండర్ శరణ్ జైన్‌తో పాటు ఇద్దరు టెయిలెండర్లను షమీ ఔట్ చేశాడు. అతను ఎలాంటి అసౌకర్యం లేకుండా తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ టైమ్‌కి షమీ ఫిట్‌నెస్ పరిస్థితి సమీక్షించాక తుది నిర్ణయం తీసుకోవాలని జాతీయ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు

నవంబరు 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు. కానీ.. అందులో షమీ పేరు లేదు. అయితే.. ఒకవేళ షమీ ఫిట్‌నెస్ సాధిస్తే టీమ్‌లోకి తీసుకుంటామని సెలెక్టర్లు ఇప్పటికే చెప్పారు.

ఈ నేపథ్యంలో.. తొలి టెస్టులో ఆడటం అనుమానమే.. కానీ.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే అనుభవం ఉన్న పేసర్. ఒకవేళ బుమ్రాకి షమీ జోడైతే.. కంగారూలకి చిక్కులు తప్పవు.

ఏడాదికిగా గాయాలతో అవస్థలు

మహ్మద్ షమీ చివరిగా గతేడాది నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత గాయంతో షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తొలుత చీలమండ గాయానికి శస్త్రచికిత్స జరిగింది. న్యూజిలాండ్‌తో ఇటీవల మూడు టెస్టుల సిరీస్ కోసం పునరాగమనం చేయబోతుండగా మోకాలికి వాపు వచ్చింది. దాంతో అతను జట్టుకి దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం రోహిత్ శర్మ మినహా.. మిగిలిన 17 మందితో కూడిన భారత్ జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకి చేరుకుంది. అయితే.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, బీసీసీఐ మెడికల్ టీమ్ షమీ ఫిట్‌‌నెస్‌ను పరీక్షించనుంది.

షమీ ముందున్న సవాల్ ఇదే

మహ్మద్ షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలంటే రంజీ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 15-18 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అలానే రోజంతా ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉండాల్సి ఉంటుంది. అతను బౌలింగ్ చేసి.. ఫీల్డింగ్ చేసిన తర్వాత మళ్లీ మోకాలి నొప్పి వస్తుందా? లేదా? అనేది బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించనుంది. ఒకవేళ అతనికి ఎలాంటి నొప్పి రాకపోతే.. ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే.

Whats_app_banner