Team India: ఆస్ట్రేలియాతొ తొలి టెస్టు ముంగిట భారత స్టార్ బ్యాటర్‌కి గాయం, పక్కనే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న వీడియో లీక్
India vs Australia Test series 2024: భారత్, ఆస్ట్రేలియా మధ్య నెక్ట్స్ వీక్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న భారత జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మంగిట భారత స్టార్ క్రికెటర్ ఒకరు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఇటీవల అక్కడికి వెళ్లిన టీమిండియా.. ప్రస్తుతం పెర్త్‌లో ఏర్పాటు చేసిన నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. నవంబరు 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జగరనుంది.
కానీ.. ఈ నెట్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడు. బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో సర్ఫరాజ్ డిఫెన్స్ చేయలేకపోయాడు. దాంతో ఆ బంతి అతని మోచేతిని బలంగా తాకడంతో.. నొప్పితో బాధపడుతూ నెట్స్ నుంచి దూరంగా సర్ఫరాజ్ ఖాన్ వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ అతను బ్యాటింగ్‌కి రాలేదు. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ తొలి టెస్టులో ఆడలేకపోతే భారత్ జట్టుకి అది ఇబ్బందే అవుతుంది.
ధ్రువ్, సర్ఫరాజ్ మధ్య పోటీ
మిడిలార్డర్‌లో ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. వాస్తవానికి న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌కి తుది జట్టులో చోటు దక్కడం సులువే. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా పిచ్‌లపై ధ్రువ్ జురెల్ నిలకడగా ఆడాడు. ఆస్ట్రేలియా- ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో ధ్రువ్ అలవోకగా పరుగులు రాబట్టాడు. దాంతో సర్ఫరాజ్ స్థానంలో అతడ్ని ఆడించే అవకాశాలూ లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.
కానీ.. సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్‌ను టీమ్‌లో కొనసాగించి.. కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని మాజీలు సూచిస్తున్నారు. అదే జరిగితే.. సర్ఫరాజ్, ధ్రువ్‌లో ఒకరు ఓపెనర్‌గా ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా ముంబయిలోనే ఉన్నాడు. తొలి టెస్టులో అందుబాటులో ఉండనని ఇప్పటికే చెప్పేశాడు.
ఆస్ట్రేలియాలో కోహ్లీ క్రేజ్
భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు పెర్త్‌కి వస్తున్నారు. కానీ.. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌ను గోప్యంగా ఉంచుతున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కానీ.. అభిమానులు మాత్రం చెట్లు, బిల్డింగ్‌లపైకి వెళ్లి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను చూస్తున్నారు. అంతేకాదు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది కోహ్లీ చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. ఈ ఏడాది 19 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 20.33 సగటుతో 488 పరుగులు మాత్రమే చేశాడు, 25 ఇన్నింగ్స్ ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు.
నాలుగేళ్లుగా తిరోగమనంలో కోహ్లీ
2016 నుంచి 2019 వరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ 66.79 సగటుతో 16 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 4,208 పరుగులు చేశాడు. కానీ.. 2020 నుంచి కోహ్లీ ప్రదర్శన తీసికట్టుగా మారుతోంది. ఈ నాలుగేళ్లలో 34 టెస్టులు ఆడిన కోహ్లీ 31.68 సగటుతో 1,838 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధశతకాలు ఉన్నాయి.
ఇటీవల బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 21.33 సగటుతో కేవలం 192 పరుగులు మాత్రమే కోహ్లీ చేశాడు. దాంతో దాదాపు పదేళ్ల తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్-20లో చోటు కోల్పోయాడు.