DC vs CSK: డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?-dc vs csk ipl 2024 today match prediction who will win delhi capitals vs chennai super kings clash pitch details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Csk: డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?

DC vs CSK: డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?

Sanjiv Kumar HT Telugu
Mar 31, 2024 12:51 PM IST

DC vs CSK IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తన మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. మరి ఇప్పటివరకు సున్న పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి అయినా స్థానం మార్చుకోనుందా. విశ్లేషకులు ఎవరిది గెలుపు అంటున్నారు.

డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?
డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?

DC vs CSK IPL 2024: మార్చి 31న అంటే ఇవాళ (ఆదివారం) విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్ అని తెలిసిందే. అయితే, ఇప్పటికీ రెండు మ్యాచుల్లో సున్నా పాయింట్లతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

ఇక మరోవైపు సీఎస్కే రెండు మ్యాచుల్లో 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలయింది. అలాగే మార్చి 28న జరిగిన రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇలా వరుసగా రెండు ఓటమిలతో డీసీ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండిపోయింది. మరి ఆదివారం నాటి సీఎస్‌కే మ్యాచ్‌లో జోరు చూపించి విజయంవైపు పరుగులు తీస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే, మార్చి 22న ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. అనంతరం మార్చి 26న గుజరాత్ టైటాన్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో మరోసారి విజేతగా నిలిచింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. అందులో డీసీ 10, చెన్నై 19 గెలుచుకుంది. సీఎస్‌కేపై ఢిల్లీ అత్యధికంగా 198 స్కోర్ చేయగా.. డీసీపై చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా 223 స్కోర్ చేసింది.

ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 గెలిచింది. ఐపీఎల్ 2021లో చివరిసారిగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే అతి తక్కువ స్కోర్ చేయగా అందులో ఢిల్లీ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్ల తేడాతో చేరుకుంది డీసీ.

డ్రీమ్ 11 ప్రిడిక్షన్

రిషబ్ పంత్(వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర(కెప్టెన్), దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, ఇషాంత్ శర్మ.

పిచ్ రిపోర్ట్

విశాఖపట్నం ఐపీఎల్‌కు ఒక టిపికల్ పిచ్ అని చెప్పొచ్చు. బ్యాట్స్ మెన్స్‌కి అధిక పరుగులు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. కానీ, ఈ మైదానంలో 200కిపైగా రన్స్ మాత్రం చేయలేదు. ఇప్పటివరకు ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 7 మ్యాచ్‌లను రెండో స్థానంలో బ్యాటింగ్ చేసిన జట్లు గెలుచుకున్నాయి.

2016లో డీసీపై ముంబై ఇండియన్స్ చేసిన 206/4 పరుగులే ఈ మైదానంలో అత్యధిక స్కోరు. అయితే అదే ఏడాది 173 అత్యధిక పరుగుల లక్ష్యాన్ని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఛేదించింది. సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 158 కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 131. ఐపీఎల్ సీజన్‌లో ఈ పిచ్‌పై ఏ బ్యాట్స్ మన్ కూడా సెంచరీ చేయలేకపోయాడు.

డీసీ వర్సెస్ సీఎస్కే వాతావరణం

మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వైజాగ్‌లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉంటుంది. మ్యాచ్ మొత్తం దాదాపు ఇలాగే ఉంటుంది. వర్షాలు కురిసే అవకాశం లేకపోయినా 78 శాతం వరకు తేమ ఉంటుంది. గూగుల్ అంచనా ప్రకారం ఈ మూడో మ్యాచ్‌లో ఢిల్లీని చెన్నై ఓడించడానికి 57 శాతం అవకాశం ఉంది. ఇలా మూడోసారి వరుస విజయంతో పాయింట్ల పట్టికలో సీఎస్‌కే టాప్ పొజిషన్‌లో ఉండనుందని అంచనా వేస్తున్నారు.

DC vs CSK IPL 2024 Today Match Prediction
DC vs CSK IPL 2024 Today Match Prediction (Google)
Whats_app_banner