Pakistan vs Nepal: నేపాల్‍పై పాకిస్థాన్ బంపర్ విక్టరీ.. ఆసియాకప్‍లో ఆజమ్ సేన అదిరే ఆరంభం
Pakistan vs Nepal: ఆసియాకప్ తొలి మ్యాచ్‍లో నేపాల్‍పై పాకిస్థాన్ భారీ విజయం సాధించింది. నేపాల్‍ను చిత్తు చేసింది.
Pakistan vs Nepal - Asia Cup 2023: ఆసియాకప్ 2023 టోర్నీని పాకిస్థాన్ అదిరిపోయేలా ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటి టోర్నీ తొలి మ్యాచ్‍లో నేపాల్‍ను చిత్తు చేసింది. పాక్‍లోని ముల్తాన్ వేదికగా నేడు (ఆగస్టు 30) జరిగిన మ్యాచ్‍లో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో నేపాల్‍ను ఓడించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (151 పరుగులు), ఇఫ్తికార్ అహ్మద్ (109 పరుగులు నాటౌట్) సెంచరీలతో దుమ్మురేపటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగుల భారీ స్కోరు చేసింది. నేపాల్ బౌలర్లలో సోమ్‍పాల్ కామి రెండు వికెట్లతో రాణించాడు. భారీ లక్ష్యఛేదనలో నేపాల్ కుప్పకూలింది. పాక్ బౌలర్లు విజృంభించటంతో నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ స్పిన్నర్ షాబాద్ ఖాన్ 4 వికెట్లతో విజృంభించగా.. షహీన్ షా అఫ్రిది, హరిస్ రపూఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బాబర్ - ఇఫ్తికార్ ‘డబుల్’ సెంచరీ భాగస్వామ్యం
పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‍కు దిగగా.. ఓపెనర్లు ఫకర్ జమాన్ (14), ఇమాముల్ హక్ (5) ఎక్కువసేపు నిలువలేదు. మహమ్మద్ రిజ్వాన్ (44) ఉన్నంతసేపు అదరగొట్టి.. రనౌట్ అయ్యాడు. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్ దుమ్మురేపారు. నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. బౌండరీలు, సిక్సర్లతో జోరు చూపారు. హాఫ్ సెంచరీల తర్వాత మరింత జోరు పెంచారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 109 బంతుల్లోనే సెంచరీ చేరాడు. వన్డేల్లో వేగంగా 19 శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు బాబర్.
ఆ తర్వాత ఆజమ్ మరింత దూకుడుగా ఆడాడు. ఇక ఆరంభం నుంచి బాదుడు బాటే పట్టిన ఇఫ్తికార్ 42 ఓవర్ తర్వాత మరింత విజృభించాడు. ఈ క్రమంలో 67 బంతుల్లోనే శతకం చేశాడు. చివరి ఓవర్లో నేపాల్ బౌలర్ సోంపాల్ బౌలింగ్‍లో బాబర్ ఔటయ్యాడు. బాబర్ ఆజమ్ - ఇఫ్తికార్ అహ్మద్ ఐదో వికెట్‍కు 214 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డబుల్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‍తో అదరగొట్టి పాకిస్థాన్‍కు భారీ స్కోరును అందించారు. 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసి నేపాల్‍కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది పాక్.
టపటపా కుప్పకూలిన నేపాల్
భారీ లక్ష్యఛేదనకు దిగిన నేపాల్‍ను పాకిస్థాన్ బౌలర్లు ఆది నుంచే ముప్పుతిప్పలు పెట్టారు. నేపాల్ ఓపెనర్ కుశాల్ భుర్టెల్ (8)ను పాక్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ తొలి ఓవర్లోనే ఔట్ చేయగా.. తర్వాతి బంతికే కెప్టెన్ రోహిత్ పౌడెల్ (0)ను కూడా గోల్డెడ్ డక్ చేశాడు. ఆసిఫ్ షేక్ (5) కూడా వెంటనే వెనుదిరగటంతో నేపాల్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం ఆరిఫ్ షేక్ (26), సోంపామ్ కామీ (28) నిలకడగా ఆడటంతో నేపాల్ కాస్త కుదురుకుంది. అయితే, ఆ ఇద్దరినీ పాక్ పేసర్ హరిస్ రావూఫ్ ఔట్ చేయటంతో నేపాల్ పతనం వేగవంతమైంది. ఆ తర్వాత పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. గుల్షన్ ఝా (13) కాసేపు ప్రతిఘటించాడు. దీపేంద్ర సింగ్ అరీ (3), కుశాల్ మల్లా (6), సందీప్ లామిచానే (0), లలిత్ రాజ్‍బన్షీ (0) అలా వచ్చి ఇలా ఔటయ్యారు. దీంతో నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది.
కాగా, ఆసియాకప్ 2023లో ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍తోనే ఆసియాకప్ పోరును రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మొదలుపెట్టనుంది.