Babar Azam Record: ఆసియాకప్ 2023 టోర్నీలో పోరును పాకిస్థాన్ అద్భుతంగా ఆరంభించింది. ఆసియాకప్‍కు సుమారు 15 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. పాక్‍లోని ముల్తాన్ వేదికగా ఆసియాకప్ 2023 తొలి మ్యాచ్ పాకిస్థాన్, నేపాల్ మధ్య నేడు (ఆగస్టు 30) జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151) భారీ సెంచరీ సహా ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) మెరుపు శతకం చేయటంతో 50 ఓవర్లలో పాక్ 6 వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. కాగా, ఈ క్రమంలో బాబర్ ఆజమ్ ఓ రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాలివే..
ఈ మ్యాచ్‍లో విజృంభించిన బాబర్ ఆజమ్..19వ అంతర్జాతీయ వన్డే (ODI) శతకం పూర్తి చేసుకున్నాడు. 42వ ఓవర్లో సెంచరీ మార్కును చేరాడు. దీంతో వన్డేల్లో 19వ శతకం విషయంలో హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాళ్లను బాబర్ అధిగమించాడు. 102 ఇన్నింగ్స్(104 మ్యాచ్‍లు)లోనే 19 వన్డే శతకాలు పూర్తి చేసుకున్నాడు బాబర్ ఆజమ్. దీంతో.. వన్డేల్లో వేగంగా 19 శతకాలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 19 శతకాలు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ప్లేయర్ హషిమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్) పేరిట ఇంతకాలం రికార్డు ఉండేది. దాన్ని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇప్పుడు బద్దలుకొట్టాడు. ఆసియాకప్ తొలి మ్యాచ్‍లో నేపాల్‍పై సెంచరీ చేసి తన 102వ ఇన్నింగ్స్‌లోనే 19వ సెంచరీని నమోదు చేశాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 124 ఇన్నింగ్స్‌లో 19వ సెంచరీ చేశాడు. ఈ విషయంలో అతడిని బాబర్ అధిగమించాడు. వార్నర్ (139 ఇన్నింగ్స్), డెవిలియర్స్ (171)ను కూడా ఈ లిస్టులో దాటాడు.
అయితే, ఓవరాల్ సెంచరీల విషయంలో విరాట్ కోహ్లీకి ఆమడ దూరంలో ఉన్నాడు బాబర్ ఆజమ్. కోహ్లీ ఇప్పటి వరకు 46 వన్డే సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కోహ్లీ 29 శతకాలు చేయగా.. బాబర్ తొమ్మిదే చేశాడు.