Asia Cup 2023 - PAK vs NEP: ఆసియా కప్ తొలి మ్యాచ్‍లో శతకాల మోత.. పాకిస్థాన్ భారీ స్కోరు-babar azam iftikar ahmed hits centuries as pakistan scores big in asia cup 2023 first match against nepal ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup 2023 - Pak Vs Nep: ఆసియా కప్ తొలి మ్యాచ్‍లో శతకాల మోత.. పాకిస్థాన్ భారీ స్కోరు

Asia Cup 2023 - PAK vs NEP: ఆసియా కప్ తొలి మ్యాచ్‍లో శతకాల మోత.. పాకిస్థాన్ భారీ స్కోరు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 30, 2023 08:14 PM IST

Asia Cup 2023 - PAK vs NEP: ఆసియా కప్ తొలి మ్యాచ్‍లో పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. నేపాల్‍కు భారీ టార్గెట్ నిర్దేశించింది.

Asia Cup 2023 - PAK vs NEP: ఆసియా కప్ తొలి మ్యాచ్‍లో బాబర్, ఇఫ్తికార్ శతకాల మోత.. పాకిస్థాన్ భారీ స్కోరు
Asia Cup 2023 - PAK vs NEP: ఆసియా కప్ తొలి మ్యాచ్‍లో బాబర్, ఇఫ్తికార్ శతకాల మోత.. పాకిస్థాన్ భారీ స్కోరు (AFP)

Asia Cup 2023 - PAK vs NEP: ఆసియాకప్ 2023 తొలి మ్యాచ్‍‍లోనే పాకిస్థాన్ అదరగొట్టింది. నేడు (ఆగస్టు 30) పాకిస్థాన్‍లోని ముల్తాన్ వేదికగా నేపాల్‍తో జరుగుతున్న మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151 పరుగులు; 14 పోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (71 బంతుల్లో 109 పరుగులు నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకాలు చేసి అదరగొట్టారు. నేపాల్ బౌలర్లలో సోమ్‍పాల్ కమి రెండు, కరణ్ కేసీ, సందీప్ లమిచనే చెరో వికెట్ పడగొట్టారు. నేపాల్ ముందు 343 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. పాక్ బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

టాస్ గెలిచి బ్యాటింగ్‍కు దిగిన పాకిస్థాన్‍కు ఆదిలో షాక్ తగిలింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ (14) ఆరో ఓవర్లో ఔట్ కాగా.. నిదానంగా ఆడిన ఇమాముల్ హక్ (5) తర్వాతి ఓవర్లో రనౌట్‍గా పెవిలియన్‍కు చేరాడు. దీంతో 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిది పాక్. అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ అదరగొట్టారు. దూకుడుగా ఆడారు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో 21.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును పాక్ చేరుకుంది. అయితే, ఆ తర్వాత నేపాల్ ఫీల్డర్ ఐరీ కొట్టిన అద్భుతమైన డైరెక్ట్ త్రో వల్ల రిజ్వాన్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అనంతరం అఘా సల్మాన్ (5) తర్వగా ఔటయ్యాడు.

అయితే, ఆ తర్వాత బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్ చెలరేగారు. ఈ క్రమంలో బాబర్ 72 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కు దాటాడు. ఆ తర్వాతి నుంచి ఆజమ్, ఇఫ్తికార్ దూకుడుగా ఆడారు. 37.4 ఓవర్లలో పాక్ స్కోరు 200 దాటింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ గేర్లు మార్చారు. నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపారు. ఇఫ్తికార్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేరాడు. బాబర్ ఆజమ్ 109 బంతుల్లోనే సెంచరీ చేసి.. అభివాదం చేశాడు. సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ బౌండరీల మోత మెగించారు. పాక్‍ను భారీ స్కోరు దిశగా నడిపారు. మరింత దూకుడు పెంచిన ఇఫ్తికార్ 67 బంతుల్లోనే సెంచరీ చేరాడు. 151 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి ఓవర్లో బాబర్ ఔటయ్యాడు. మొత్తంగా ఇఫ్తికార్, బాబర్ ఐదో వికెట్‍కు 214 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇఫ్తికార్ అజేయంగా నిలిచాడు. ఆజమ్‍కు ఇది 19వ వన్డే సెంచరీగా ఉంది. మొత్తంగా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 342 పరుగుల భారీ స్కోరు చేసింది పాకిస్థాన్.

Whats_app_banner