CSK New Captain: ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు.. ఫ్రాంఛైజీ సీఈవో చెప్పేశాడు-chennai super kings new captain after ms dhoni csk ceo reveals franchisee plans ipl 2024 news ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Chennai Super Kings New Captain After Ms Dhoni Csk Ceo Reveals Franchisee Plans Ipl 2024 News

CSK New Captain: ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు.. ఫ్రాంఛైజీ సీఈవో చెప్పేశాడు

Hari Prasad S HT Telugu
Mar 12, 2024 12:17 PM IST

CSK New Captain: ధోనీ తర్వాత ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేశారు ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్.

ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు.. ఫ్రాంఛైజీ సీఈవో చెప్పేశాడు
ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు.. ఫ్రాంఛైజీ సీఈవో చెప్పేశాడు

CSK New Captain: చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. కానీ ఇప్పుడతడు దాదాపుగా తన చివరి సీజన్ ఆడనున్నాడు. మరి అతని తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరు అవుతారు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటన్నది తెలియడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్.. ఆ విషయం కోచ్, కెప్టెన్ కే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

సీఎస్కే కొత్త కెప్టెన్ ఎవరు?

ఐపీఎల్ కొత్త సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి ధోనీ లీడ్ చేయనున్నాడు. బహుషా ఇదే చివరిసారి కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో ధోనీలాంటి కెప్టెన్ కు ప్రత్యామ్నాయం చూడటం సీఎస్కే ఫ్రాంఛైజీకి అంత సులువు కాదు. 2022 సీజన్లో కొన్ని మ్యాచ్ లకు జడేజాను కెప్టెన్ ను చేసినా.. అతడు విఫలం కావడంతో మళ్లీ ధోనీనే కెప్టెన్ ను చేశారు.

గతేడాది రికార్డు స్థాయిలో ఐదోసారి ధోనీ కెప్టెన్సీలోనే సీఎస్కే టైటిల్ గెలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ చేతులు మారడంపై ఆ టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించాడు. సీఎస్కే మాజీ ప్లేయర్ బద్రినాథ్ తో అతని యూట్యూబ్ ఛానెల్లో ఆయన మాట్లాడారు.

"దీనిపై అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. కానీ శ్రీనివాసన్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ నియామకాల గురించి మనం మాట్లాడకూడని అన్నారు. ఆ విషయం కెప్టెన్, కోచ్ లకే వదిలేయాలని తేల్చి చెప్పారు. వాళ్లు నిర్ణయించి వాళ్లు ఆ విషయాన్ని నాకు చెబితే నేను మీ అందరితో చెబుతానని శ్రీనివాసన్ తెలిపారు. కెప్టెన్, కోచ్ నిర్ణయం తీసుకునే వరకూ ఈ విషయంపై అందరూ మౌనంగా ఉండాలన్నారు" అని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.

ధోనీ వచ్చేశాడు

మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్ కోసం మార్చి తొలి వారంలోనే చెన్నైలో అడుగుపెట్టాడు కెప్టెన్ ధోనీ. గతేడాది మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న అతడు.. కోలుకున్న తర్వాత కొత్త సీజన్ కు సిద్ధమయ్యాడు. మరోసారి క్రికెట్ తొలినాళ్లలో కనిపించినట్లుగా లాంగ్ హెయిర్ తో ఐపీఎల్ 2024 బరిలోకి ధోనీ దిగబోతున్నాడు. ధోనీ చెన్నైలో అడుగుపెట్టిన విషయాన్ని లియో మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో సీఎస్కే టీమ్ ఓ స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించింది.

తాజా సీజన్లో ధోనీ కెప్టెన్సీలో మరోసారి సీఎస్కే టైటిల్ గెలుస్తుందన్న ఆశతో తమ టీమ్ ఉన్నట్లు సీఈవో విశ్వనాథన్ చెప్పారు. "మేము నాకౌట్స్ కు క్వాలిఫై అవడంపైనే ఎప్పుడూ దృష్టి సారిస్తాం. మా తొలి లక్ష్యం అదే. ఆ తర్వాత ఆ రోజు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. ప్రతి సీజన్ ముందు ధోనీ ఒక్కటే చెబుతాడు.. ముందుగా లీగ్ మ్యాచ్ లపై దృష్టి సారిద్దాం.. నాకౌట్స్ కు క్వాలిఫై అవుదామని. ఒత్తిడి ఉంది. కానీ గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్న మా ఆటతీరు వల్ల ప్లేయర్స్ ఈ ఒత్తిడికి అలవాటు పడ్డారు" అని కాశీ విశ్వనాథన్ తెలిపారు.

ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరగనుంది.

IPL_Entry_Point