BCCI secretary: జై షా స్థానంలో మాజీ కేంద్ర మంత్రి తనయుడు.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఈయనేనా?
BCCI secretary: జై షా స్థానంలో బీసీసీఐ సెక్రటరీ అయ్యేది ఎవరు? ఒకవేళ ఆయన ఐసీసీ ఛైర్మన్ అయితే ఖాళీ అయ్యే ఈ స్థానాన్ని మరో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనయుడు భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జై షా మాత్రం ఇంత వరకూ నామినేషన్ దాఖలు చేయలేదు.
BCCI secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరు అన్న చర్చ అప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా ఐసీసీ ఛైర్మన్ కావడం ఖాయం అన్న అంచనాల నేపథ్యంలో కొత్త కార్యదర్శిపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనయుడు, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీసీసీఐ కొత్త సెక్రటరీ ఈయనేనా?
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ ఛైర్మన్ పదవిపై కన్నేశారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న బార్‌క్లే మూడోసారి ఆ పదవి కోసం పోటీపడబోనని చెప్పడంతోపాటు వివిధ బోర్డుల మద్దతుతో జై షా ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆయన ఈ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయలేదు.
అప్పుడే బీసీసీఐ కొత్త కార్యదర్శిపై చర్చ మొదలైంది. ఆయన స్థానంలో అరుణ్ జైట్లీ తనయుడు, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ రావడం ఖాయమని దైనిక్ భాస్కర్ రిపోర్టు వెల్లడించింది. బీసీసీఐలో చాలా మంది మద్దతు రోహన్ కే ఉన్నట్లు ఈ రిపోర్టు తెలిపింది. జై షా కాకుండా మిగిలిన పదవుల్లో ఉన్న వారి పదవీ కాలం మరో ఏడాది ఉండటంతో వాళ్లు కొనసాగనున్నారు.
రోహన్ జైట్లీకి పోటీ
బీసీసీఐ కొత్త కార్యదర్శి రేసులో రోహన్ జైట్లీ ఉన్నా.. ఆయనకు పలువురు నుంచి పోటీ ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ మాజీ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ప్రధాన పోటీదారు కావచ్చని పీటీఐ గతంలో వెల్లడించింది.
ఆయనే కాకుండా పంజాబ్ అసోసియేషన్ కు చెందిన దిల్షేర్ ఖన్నా, గోవాకు చెందిన విపుల్ ఫడ్కే, చత్తీస్‌గఢ్ కు చెందిన ప్రభ్‌తేజ్ భాటియా కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఖాయమేనా?
ఐసీసీకి ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30న ముగియనుంది. ఆ తర్వాత తాను పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీంతో జై షానే నెక్ట్స్ ఛైర్మన్ అన్న ప్రచారం మొదలైంది. ఆయనకు 16 మందిలో 15 మంది సభ్యుల మద్దతు ఉంది. కొత్త ఛైర్మన్ పదవి కోసం ఈ నెల 27లోపు నామినేషన్లు వేయాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ జై షా మాత్రం ఇంకా వేయలేదు.
కొత్త ఐసీసీ ఛైర్మన్ డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఒకవేళ జై షా (35) ఈ పదవి చేపడితే మాత్రం అత్యంత పిన్న వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అవుతారు. గతంలో ఇండియా నుంచి జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లాంటి వాళ్లు ఈ పదవి చేపట్టారు.