Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్సీని మరోసారి వదిలేసిన బాబర్ ఆజమ్.. కారణం ఏం చెప్పాడంటే..
Babar Azam - Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్ కెప్టెన్సీని మరోసారి వదులుకున్నాడు బాబర్ ఆజమ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కారణాలను వివరించాడు.
పాకిస్థాన్ క్రికెట్‍లో అస్థిరత కొనసాగుతూనే ఉంది. కొంతకాలంగా పేలవంగా ఆడుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది ఆ జట్టు. తాజాగా పాకిస్థాన్ టీ20, వన్డే కెప్టెన్సీ బాబర్ ఆజమ్ తప్పుకున్నాడు. సారథ్యాన్ని వదిలేశాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీని అతడు కోల్పోయాడు. మళ్లీ సారథిగా ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో సుదీర్ఘంగా పోస్ట్ చేసి కారణాలను వివరించారు.
వ్యక్తిగత పర్ఫార్మెన్స్ కోసమే..
తన వ్యక్తిగత పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తాను భావిస్తున్నానని, అందుకే కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు బాబర్ ఆజమ్ తెలిపాడు. కెప్టెన్సీ వల్ల తనకు వర్క్ లోడ్ అధికంగా పెరుగుతోందని ట్వీట్ చేశాడు. వ్యక్తిగత వృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు గత నెలలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), మేనేజ్‍మెంట్‍కు తాను చెప్పానని, ఇప్పుడు బహిరంగంగా ప్రకటిస్తున్నానని ఆజమ్ వెల్లడించాడు. “నేను ఈ విషయాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‍గా నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. గత నెలలోనే పీసీబీ, మేనేజ్‍మెంట్‍కు చెప్పా. జట్టుకు సారథ్యం వహించడం గౌరవం. అయితే, నేను తప్పుకునేందుకు ఇదే సరైన సమయం. నేను నా ఆటపై ఫోకస్ చేయాలని అనుకుంటున్నా” అని బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీతో పనిభారం
తన బ్యాటింగ్‍ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్టు బాబర్ ఆజమ్ తెలిపారు. “కెప్టెన్సీ అనేది మంచి ఎక్స్‌పీరియన్స్. కానీ దాని వల్ల పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. నా పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, నా బ్యాటింగ్‍ను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. నాలో సంతోషాన్ని పెంచే కుటుంబంతో సమయాన్ని గడపాలని భావిస్తున్నా” అని ఆయమ్ తెలిపాడు.
కెప్టెన్సీని వదులుకోవడం ద్వారా తన ఆటపై, వ్యక్తిగత వృద్ధిపై క్లారిటీ పెరుగుతుందని బాబర్ చెప్పాడు. తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఆటగాడిగా తాను కొనసాగుతానని స్పష్టం చేశాడు.
కెప్టెన్సీ కుర్చీలాట
పాకిస్థాన్ క్రికెట్‍లో ఏడాది కాలంగా కెప్టెన్సీ కుర్చీలాటగా మారింది. వన్డే ప్రపంచకప్‍లో విఫలమయ్యాక కెప్టెన్సీని బాబర్ బాబర్ ఆజమ్ వదిలేశాడు. ఆ తర్వాత షహీన్ షా అఫ్రిదిని టీ20 కెప్టెన్‍గా పీసీబీ నియమించింది. పీఎస్‍ఎల్ తర్వాత షహిన్‍ను కెప్టెన్సీ నుంచి పీసీబీ తప్పించింది. మళ్లీ పాకిస్థాన్ వన్డే, టీ20 జట్లకు బాబర్ ఆజమ్‍ను కెప్టెన్‍ను చేసింది. టెస్టు కెప్టెన్‍గా షాన్ మసూద్ ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో అమెరికాతో ఓడడం సహా గ్రూప్ దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు కెప్టెన్సీ నుంచి మళ్లీ తప్పుకున్నాడు బాబర్ ఆజమ్. మళ్లీ ఈ స్థానంలో ఎవరిని పీసీబీ కెప్టెన్‍ను చేస్తుందో చూడాలి.
సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‍ను 0-2తో పాకిస్థాన్ కోల్పోయింది. ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‍పై కూడా విమర్శలు వస్తున్నాయి.