Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ గుడ్‍బై: కొత్త కెప్టెన్లు ఎవరంటే..
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ గుడ్‍బై చెప్పాడు. వన్డే ప్రపంచకప్‍లో పాక్ పేలవ ప్రదర్శన చేయడంతో సారథ్యం నుంచి బాబర్ తప్పుకున్నాడు.
Babar Azam: అనుకున్నదే జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ తప్పుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో సారథ్యానికి గుడ్‍బై చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేయగా.. బాబర్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. దీంతో సారథ్య బాధ్యతల నుంచి అతడు తప్పుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు నేడు (నవంబర్ 15) సోషల్ మీడియా ద్వారా బాబర్ ఆజమ్ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా పాకిస్థాన్ జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
వన్డే ప్రపంచకప్‍లో లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో నాలుగు మాత్రమే గెలిచిన పాకిస్థాన్ సెమీస్‍కు అర్హత సాధించలేకపోయింది. 8 పాయింట్లు మాత్రమే సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో, ప్రపంచకప్‍లో తమ జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెనీని వదులుకున్నాడు బాబర్ ఆజమ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.
“ఈరోజు, నేను అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. ఇది కష్టమైన నిర్ణయమే అయినా.. ఇదే సరైన సమయం అనిపించింది. మూడు ఫార్మాట్‍లలో ప్లేయర్‌గా పాకిస్థాన్‍కు ప్రాతినిథ్యం వహించడాన్ని కొనసాగిస్తా. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‍కు, నా జట్టుకు సహకరిస్తా. ఈ అద్భుతమైన బాధ్యతను నాకు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు” అని బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు.
2019లో పాకిస్థాన్ టీ20 కెప్టెన్సీ చేపట్టిన బాబర్ ఆజమ్.. తర్వాతి ఏడాది మేలో వన్డే సారథి కూడా అయ్యాడు. నెల తర్వాత టెస్టు బాధ్యతలు కూడా చేపట్టాడు. మూడు ఫార్మాట్లలో పాకిస్థాన్ కెప్టెన్ అయ్యాడు. అతడి సారథ్యంలో పాకిస్థాన్ వన్డే ర్యాంకింగ్‍ల్లో కొన్ని రోజులు నంబర్ స్థానంలో నిలిచింది. 2021 టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరింది. 2022 టీ20 ప్రపంచకప్‍లో రన్నరప్‍గా నిలిచింది. అయితే, 2023 వన్డే ప్రపంచకప్‍లో జట్టు విఫలమవటంతో ఇప్పుడు కెప్టెన్సీకు బాబర్ గుడ్‍బై చెప్పాడు.
కొత్త కెప్టెన్లు
కొత్త కెప్టెన్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్థాన్‍కు టీ20 ఫార్మాట్‍లో పేసర్ షహిన్ షా అఫ్రిదీని కెప్టెన్‍గా నియమించింది. టెస్టు కెప్టెన్‍గా షాన్ మసూద్‍ను ఎంపిక చేసింది. అయితే, వన్డే ఫార్మాట్‍కు సారథిని సెలెక్ట్ చేయలేదు.