Analysis : ఆ పొత్తుతో ... ‘వైనాట్‌ 175’ చిత్తా ?-ysrcp seems to be worried about tdp janasena alliance after pawan kalyan and chandrababu meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Seems To Be Worried About Tdp Janasena Alliance After Pawan Kalyan And Chandrababu Meeting

Analysis : ఆ పొత్తుతో ... ‘వైనాట్‌ 175’ చిత్తా ?

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 04:38 PM IST

Analysis : జనసేన, టీడీపీ పొత్తుపై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను చూస్తే ఈ పొత్తుపై వైఎస్‌ఆర్‌సిపి భయపడుతున్నట్లు ఉందని.. ఈ భయాన్ని ప్రతిపక్షాలు సానుకూలంగా తీసుకొని అస్త్రంలా వాడుకునే అవకాశాలను వారే కల్పిస్తున్నారని అంటున్నారు... పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ అనలిస్ట్ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ. చంద్రబాబుతో పవన్ భేటీ తర్వాత ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన విశ్లేషణ ఇదీ.

పవన్ - చంద్రబాబు
పవన్ - చంద్రబాబు (twitter)

Analysis : ‘‘సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా జగన్‌ నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సిపి సమర్థవంతంగా .... ఎదుర్కొంటుంది..’’ అని ఎప్పుడూ గంభీరంగా పలికే ఆ పార్టీ నేతలు పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు ఒకరినొకరు పలకరించుకుంటునే ఉలిక్కిపడుతున్నారు. పార్టీ అగ్రనేతలు మొదలుకొని మంత్రులు వరకు ప్రతిపక్ష నేతల కలయికను చూసి కలవరపడుతున్నట్లు చెప్పడానికి వారి వ్యాఖ్యానాలే నిదర్శనం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిత్యం జపించే ‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని ఆ విమర్శలు చెప్పకనే చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి విజయం ఖాయమని ఆ పార్టీ ప్రకటనలు డాంభీకమని చంద్రబాబు పవన్‌ కలయికపై వైఎస్‌ఆర్‌సిపి చేస్తున్న విమర్శలు తేటతెల్లం చేస్తున్నాయి. 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్న పార్టీ ఆత్మవిశ్వాసం బదులు ప్రతిపక్షాల కలయికపై చేస్తున్న దాడులు చూస్తుంటే వారికి పై విషయాల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో భయపడుతూ ప్రత్యర్థులకు అస్త్రం అందించేలా ఉంది ప్రస్తుత వైఆర్‌సిపి నేతల తీరు. జనసేన, టిడిపి పొత్తుపై వారు చేస్తున్న విమర్శలను చూస్తే ఈ పొత్తుపై వైఎస్‌ఆర్‌సిపి భయపడుతున్నట్లు ఉంది. ఈ భయాన్ని ప్రతిపక్షాలు సానుకూలంగా తీసుకొని అస్త్రంలా వాడుకునే అవకాశాలను వారు కల్పిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

జగన్‌ ప్రభుత్వ తీరే పొత్తుకు ఊతం..

రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవనే ప్రాథమిక సూత్రాన్ని జగన్‌ అండ్‌ కో మరిచినట్టున్నారు. చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ ఒకరినొకరు కలుసుకోవడానికి జగన్‌ ప్రభుత్వమే అవకాశం కల్పించింది. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, నిరసనలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కు అందరికీ ఉంటుంది. దాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇక్కడే ప్రభుత్వం తప్పటడుగులు వేసి ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రాన్ని అందించింది. పవన్‌, చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలను జగన్‌ ప్రభుత్వం భూతద్దంలో చూస్తూ అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. లోగడ విశాఖలో జనసేన కార్యక్రమాలను అడ్డుకొని పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చంద్రబాబు నాయుడు లౌక్యంతో ఒక రాజకీయ అవకాశంగా మల్చుకొని ఆగమేఘాల మీద విజయవాడలో పవన్‌ను పరామర్శించడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చిగురించింది. తాజాగా రాష్ట్రంలో సభలు, సమావేశాలపై నిబంధనలు విధిస్తూ జీవో నెంబరు. 1 తీసుకొచ్చి చంద్రబాబు సభలను ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈ సారి పవన్‌ చొరవ తీసుకొని హైదరాబాద్‌లో చంద్రబాబును పరామర్శిండంతో రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలు దాదాపు ఖాయం అయ్యాయి. ఈ పరిణామాలతో వైఎస్‌ఆర్‌సిపి అగ్ర నాయకులు, మంత్రులు ఈ పొత్తుపై తిట్ల దండకం ప్రారంభించారు. పవన్‌ కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని, కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని, పవన్‌ ప్యాకేజి లీడరని, ఇద్దరు ముసుగు దొంగలని, జనసేన టిడిపికి ‘బి’ టీమ్‌ అని, రాజకీయాలంటే సినిమా కాదని అనేక విధాలుగా ఆకాశమే హద్దుగా వ్యక్తిగత విమర్శలు కుప్పించారు.

రాజకీయాల్లో పొత్తులు మొదటి సారి కాదు..

రాజకీయాల్లో పొత్తులు మొదటి సారి అన్నట్లు విమర్శలు సాగిస్తున్నారు వైఎస్‌ఆర్‌సిపి నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి ఆరాధ్యదైవమైన వైఎస్‌, రాజశేఖర్‌రెడ్డి నేత్వత్వంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించడానికి టిఆర్‌ఎస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకుందనే విషయాన్ని వైఎస్‌ఆర్‌సిపి నేతలు మరిచినట్టున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, రాజకీయ అవగాహనల్లో పొత్తులు సర్వసాధారణమే. రాష్ట్ర విభజన అసంతరం జరిగిన తొలి ఎన్నికలు 2014లో టిడిపి, బిజెపి కూటమికి జససేన మద్దతుగా నిలవడంతో చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టారు. అయితే తర్వాత పరిణామాల్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టున్న పవన్‌కళ్యాణ్‌కు టిడిపికి మధ్య దూరం పెరిగింది. 2019 ఎన్నికల్లో టిడిపికి వైఎస్‌ఆర్‌సిపితో పాటు జసనేన కూడా ప్రత్యర్థిగా మారింది. చంద్రబాబు ఒంటెత్తు పోకవడలతో పవన్‌ పట్ల ప్రవర్తించిన తీరు వల్ల కాపు సామాజిక వర్గం మొత్తం 2019 ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా, పవన్‌కు మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పక్షాన ఉన్న కాపు ఓట్లు చీలిపోవడంతో జగన్‌కు కలిసి వచ్చి 2019లో అందలమెక్కారు. అధికారం చేపట్టాక జగన్‌ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలపై కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తుండడంతో ప్రతిపక్షాల ఐక్యతకు బాటలు వేసినట్టయ్యింది. అధికార పార్టీ నిర్ణయాలు స్వయకృతాపరాధమై గుదిబండగా మారబోతున్నాయి. కూటమిపై అధికార పార్టీ ఎన్ని విమర్శలు చేసినా జనసేన, టిడిపి కూటమిగా పోటీ చేస్తే జగన్‌ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. రాష్ట్రంలో పొత్తుల అంశాలను పరిశీలిస్తే 2014 లో టిడిపికి 44.45 శాతం, మిత్రపక్ష బిజెపి 2.18, కూటమికి మొత్తం కలిపి 46.63 శాతం, వైఎస్‌ఆర్‌సిపికి 44.12 శాతం ఓట్లు వచ్చాయి. టిడిపి, బిజెపి పొత్తు కారణంగా టిడిపికి ప్రయోజనం చేకూరింది. 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి 49.95 శాతం ఓట్లు వచ్చాయి. వేర్వేరుగా పోటీ చేసిన టిడిపికి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల ఓట్ల శాతాన్ని కలిపినా వైఎస్‌ఆర్‌సిపికి ఇంకా దాదాపు 5 శాతం ఓట్లు అధికంగానే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అధికంగా ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని చూస్తే పైన చెప్పుకున్నట్లు 5 శాతం వ్యత్యాసం వైఎస్‌ఆర్‌సిపిని ఎట్టి పరిస్థితుల్లో రక్షించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానిక పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఈ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వమని పదేపదే ప్రకటించడం అధికార నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

కాపు సామాజిక కేంద్రంగా రాజకీయాలు

పవన్‌ కళ్యాణ్‌ కాపు సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి కాపు జాతికి తీవ్ర ద్రోహం చేశారని కుల రాజకీయ విమర్శలకు వైఎస్‌ఆర్‌సిపి పదునుపెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో కాపు కులం కేంద్రంగా రాజకీయాలు కొత్తేమి కాదు. 2019 ఎన్నికల్లో కాపు ఓట్లు టిడిపికి పడకుండా వైఎస్‌ఆర్‌సిపి చేసిన రాజకీయాలు బహిరంగ రహస్యమే. ఆ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలు వైఎస్‌ఆర్‌సిపికి అనుకూలంగా ఉండేలా పనిచేశారు. ఆ నేతలు కూడా అప్పుడు జగన్మోహన్‌రెడ్డి దగ్గర కాపు సామాజికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారా..? మీకు అనుకూలం అయితే ఒకటి వ్యతిరేకమైతే ఒకటా..? అని సాధారణ కాపు పౌరులు ప్రశ్నిస్తున్నారు.

మానసికంగా సిద్ధమయిన కార్యకర్తలు

చంద్రబాబు, పవన్‌ మధ్య పొత్తును దెబ్బతీయాలని మంత్రులు, వైఎస్‌ఆర్‌సిపి నేతలు పెద్దఎత్తున విమర్శలు సాగిస్తున్నారు. చంద్రబాబుకు పవన్‌ అమ్ముడుపోయారని వ్యక్తిగతంగా దూషిస్తూ రెచ్చగొడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టిడిపి, జనసేన పార్టీల నేతలు మొదలుకొని కార్యకర్తల వరకూ క్షేత్రస్థాయిలో పొత్తుపై మానసికంగా సిద్దపడడం ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చే అంశం. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్‌పై ఉన్న అభిమానం, వ్యక్తిగత ఆరాధన ఆ కూటమికి కలిసి రావచ్చు. ఈ రెండు జిల్లాల్లో జనసేనకు 15`20 శాతం వరకూ ఓట్లుంటాయి. కొన్ని స్థానాల్లో 25 శాతం వరకూ ఉన్నాయి. కొన్ని ఇతర జిల్లాల్లో కూడా 10`15 శాతం వరకూ ఆ పార్టీకి ఓట్లుండడం కూటమి విజయానికి సోపానం అవుతాయి. రాయలసీమలో జనసేనకు కనీసం 5 శాతం వరకు నిర్ణయాత్మక ఓట్లున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంతో పాటు జనసేన ఓటు బ్యాంకు కూడా తోడైతే టిడిపి, ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలోపేతం అవుతుంది. ఈ కలయికల వల్ల టిడిపి, జనసేన కూటమి విజయఢంకా ఖాయమని సంకేతాలు ఉండడంతోనే వైఎస్‌ఆర్‌సిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు చూస్తుంటే వైఎస్‌ఆర్‌సిపిని ఓటమి భయం వెంటాడుతుందని, ముందస్తుగానే వారు ఓటమికి మానసికంగా సిద్దమవుతున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది టిడిపి, జనసేకు నైతిక విజయంగా పరిణమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2014, 2019 ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా ఉన్న జనసేన రాబోయే ఎన్నికల్లో కూడా కీలకంగా మారనుందనే విషయం అధికార పార్టీ నేతలకు బోధపడి వారి ‘వై నాట్‌ 175’ నినాదానికి భంగపాటు తప్పదని ఆందోళన చెందుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ.

 

(గమనిక: వ్యాసంలోని విశ్లేషణ, అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. హెచ్‌టీ తెలుగువి కావు..)

 

 

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, విశ్లేషకులు
ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, విశ్లేషకులు
IPL_Entry_Point