YSRCP : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ పూజలు.. పలు చోట్ల హైటెన్షన్ వాతావరణం-ysrcp leaders worship in temples in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ పూజలు.. పలు చోట్ల హైటెన్షన్ వాతావరణం

YSRCP : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ పూజలు.. పలు చోట్ల హైటెన్షన్ వాతావరణం

Basani Shiva Kumar HT Telugu
Sep 28, 2024 07:59 AM IST

YSRCP : తిరుమల లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ తిరుమల పర్యటనకు వెళ్లాలనుకున్న జగన్.. రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేయలాని నాయకులను పార్టీ ఆదేశించింది. దీంతో నేతలు పూజలకు సిద్ధం అయ్యారు. ఈ కారణంగా చాలాచోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది.

పూజల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
పూజల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పూజలు చేయడానికి నాయకులు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో.. చాలామంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో చాలాచోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఆంక్షలు పెట్టినా.. తాము పూజలు చేసి చూపిస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలపై.. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే అంశంపై శుక్రవారం జగన్, సీఎం చంద్రబాబు.. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఏపీ రాజకీయం వేరే లెవల్‌కు వెళ్లింది.

'లడ్డూ విషయంలో లేనిపోని విషయాలతో అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.

'నేను తిరుమలకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్‌ చేస్తామని వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు' అని జగన్ ఆరోపించారు.

జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. 'అసలు తిరుమల వెళ్లడం జగన్‌కే ఇష్టం లేదు. ఎక్కడ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తోందో అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. సంతకం పెట్టడం ఇష్టం లేకపోవటమే జగన్ సమస్య. చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తిరుమల వచ్చినప్పుడు.. ఆ ఆచారాలను గౌరవించి వెంకన్నను దర్శనం చేసుకున్నారు. ఒక పక్క నువ్వే బైబిల్ చదువుతాను అంటున్నావ్. ఎవరి మతం వారిది, అందులో తప్పు లేదు. కానీ హిందువుల మనోభావాలు గౌరవించాలి కదా? నా ఇష్టం అంటే ఎలా కుదురుతుంది ?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

'తిరుమల వెళ్లకుండా సాకులు ఎతుక్కున్నాడు. నిన్ను గుడికి వెళ్లొద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చారా? గుడికి వెళ్లవద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చివుంటే చూపించు. ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నావ్? స్వామి వారి గుడికి దళితులను రానివ్వరు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నువ్వు తిరుమల వెళ్లకుండా సాకులు ఎతుక్కుంటూ.. దళితులని లాగుతావ్ ఎందుకు..? మీ పార్టీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు ఏమంటాడు? స్వామి వారి ప్రసాదం రాగి, పంది కొవ్వు బంగారం అంటాడా ? కనీసం ఖండించావా జగన్..?' అని చంద్రబాబు నిలదీశారు.