PAF India : మతం పేరుతో దళితులను విడదీయోద్దు
PAF India Members Meets KG Balakrishnan : దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని పీపుల్స్ యాక్షన్ ఫోరమ్ ఇండియా పేర్కొంది. చదువులు, ఉద్యోగాలు, రాజకీయంగా వివక్ష జరుగుతుందని వ్యాఖ్యానించింది.
పీపుల్స్ యాక్షన్ ఫోరమ్ ఇండియా(Peoples Action Forum India) సభ్యులు.. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్(KG Balakrishnan)ను కలిశారు. దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 1950వ సంవత్సరంలో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళితులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చదువులు, ఉద్యోగాలు, రాజకీయంగా వివక్ష జరుగుతుందని వివరించారు. దళితులు ఏ మతంలో ఉన్నా.. కులవివక్షను అనుభవిస్తున్నారన్నారు.
సమాజంలో కులం(Caste) ఉన్నన్ని రోజులు వివక్ష వుంటుందని పీపుల్స్ యాక్షన్ ఫోరమ్ ఇండియా వివరించింది. 1985లో కారంచేడు(Karamchedu)లో జరిగిన మారణ హోమాన్ని సభ్యులు గుర్తు చేశారు. కారంచేడులో బలైన వారందరూ చర్చికి వెళ్ళే దళితులనీ, కారంచేడు మరణం హోమం తరువాతనే 1989 లో SC, ST అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని తెలిపారు. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వును ఉపసంహరించుకోవడమో లేదా రద్దు చేయడమో చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు దళితులకు వర్తించడం లేదని పీపుల్స్ యాక్షన్ ఫోరమ్ ఇండియా వ్యాఖ్యానించింది. హిందు మతంలో, క్రైస్తవ మతంలోనూ వివక్ష ఉందని, క్రైస్తవులుగా మారిన అగ్ర కులాల వారు దళిత క్రైస్తవులతో కలసి జీవించడం లేదని ఫోరమ్(Forum) సభ్యులు వివరించారు. వారి మధ్య వివాహ సంబంధాలు గానీ, సామాజిక, ఆర్థిక సంబంధాలు గానీ లేవన్నారు. చర్చికి వెళ్లే దళితులకు భద్రత లేదని, ఎవరికి లేని అడ్డంకులు ఉన్నాయని, దళితులకు సంకెళ్లు వెయ్యడం సబబు కాదన్నారు.
ఆంధ్ర(Andhra), తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల నుండి ప్రతినిధులు కేజీ బాలకృష్ణన్ ను కలిశారు. పీపుల్స్ యాక్షన్ ఫోరమ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పులుగుజ్జు సురేష్ తో పాటు ప్రొఫెసర్ అండ్ డీన్ ఉస్మానియా యూనివర్సిటీ గాలి వినోద్ కుమార్, పీఏఎఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి విజయకుమార్, చిట్టెం ప్రేం కుమార్ సామాజిక కార్యకర్త ఇత్తడి రజని, పాస్టర్ ఎమ్వై మోహన్ రావు పాల్గొన్నారు.