Anantapur Chariot Burned : రాములోరి రథానికి నిప్పుపెట్టిన దుండగులు, సీఎం చంద్రబాబు సీరియస్-రంగంలోకి ప్రత్యేక బృందాలు-anantapur kanekal ramalayam chariot burned cm chandrababu ordered inquiry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur Chariot Burned : రాములోరి రథానికి నిప్పుపెట్టిన దుండగులు, సీఎం చంద్రబాబు సీరియస్-రంగంలోకి ప్రత్యేక బృందాలు

Anantapur Chariot Burned : రాములోరి రథానికి నిప్పుపెట్టిన దుండగులు, సీఎం చంద్రబాబు సీరియస్-రంగంలోకి ప్రత్యేక బృందాలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 24, 2024 02:22 PM IST

Anantapur Chariot Burned : అనంతపురంలో జిల్లా హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి ఆగంతకులు నిప్పుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు గమనించే సరికి సగానికి పైగా రథం కాలిపోయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.

అనంతపురం జిల్లాలో రామాలయం రథానికి నిప్పుపెట్టిన దుండగులు, సీఎం చంద్రబాబు సీరియస్
అనంతపురం జిల్లాలో రామాలయం రథానికి నిప్పుపెట్టిన దుండగులు, సీఎం చంద్రబాబు సీరియస్

Anantapur Chariot Burned : ఏపీలో తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న క్రమంలో మరో ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో రామాలయం రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి రామాలయం ముందు ఉన్న రథానికి దుండగులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి సమయంలో మంటలను గమనించిన స్థానికులు వెంటనే వాటిని అదుపుచేశారు. అయితే అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. స్థానికుల సమాచారంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రథం కాలిపోయిన తీరుని పరిశీలించిన డీఎస్పీ రవిబాబు.....నిందితులను పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. రథం వద్ద నిందితులకు సంబంధించిన క్లూస్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితులను అరెస్టు చేశాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు... ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి విచారణ జరపాలని కలెక్టర్‌, ఎస్పీని సీఎం సూచించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక అందించాలన్నారు.

తిరుమల లడ్డూ వివాదంలో ఆర్ డెయిరీకి నోటీసులు

తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది.

గత నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి తమకు సమాచారం అందిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. టీటీడీకి సరఫరా చేసిన శాంపిళ్లను పరీక్షల నిమిత్తం గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపింది. సెప్టెంబర్ 23లోగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రెగ్యులేషన్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Whats_app_banner

సంబంధిత కథనం