YCP Rebel MLAs: స్పీకర్ విచారణకు హాజరైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
YCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. అనర్హత అంశంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు.
YCP Rebel MLAs: వైసీపీని వీడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.
మరోవైపు స్పీకర్ ముందు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చివరకు విచారణకు హాజరవ్వాలని నిర్ణయించారు. ఆరోగ్యం సరిగా లేదంటూ ఇప్పటికే స్పీకర్‍కు రాసిన మేకపాటితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు విచారణకు హాజరయ్యారు.
కొద్దిరోజుల క్రితం విశాఖస్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం అమోదించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా నేడు విచారణకు హాజరుకానున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 8వరకు గడువు కోరారు.
వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.విచారణకు తగినంత సమయం కావాలని కోరితే కొద్ది రోజులు మాత్రమే గడువు ఇచ్చారని, డాక్యుమెంట్స్ సమర్పించలేదని తాము అడిగామని, వాటిని స్పీకర్ తమకు అందించలేదని ఆనం రామ నారయాణ రెడ్డి చెప్పారు. స్పీకర్ ఆదేశాల మేరకు విచారణకు హాజరైనట్టు చెప్పారు.
స్పీకర్ తమకు ఇచ్చిన డాక్యుమెంట్లలో విశ్వసనీయత లేదన్నారు. ఎలాంటి విశ్వసనీయత లేని పత్రాలను ఎలా ప్రమాణికంగా తీసుకుంటారని చెప్పారు. తాము కోరినంత సమయం ఎందుకు ఇవ్వలేదన్నారు.
మొదటి లేఖ రాసినపుడు గడువు కోరితే వారం రోజుల గడువు ఇచ్చారని, రెండోసారి లేఖ రాసినపుడు గడువు కోరితే మరో వారం మాత్రమే ఇచ్చారని, విచారణ తేదీ ఏకపక్షంగా నిర్ణయించారన్నారు.
వ్యక్తిగతం రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడున్నరేళ్లు పట్టించుకోకుండా , తమకు ఇచ్చిన నోటీసుల్లో వారంలో రావాలని ఎలా కోరుతారని ఆనం ప్రశ్నించారు. స్పీకర్ ఆదేశాలను తాము పాటిస్తామని చెప్పారు. అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఏమి చేయాలన్నది తాము ఆలోచిస్తామన్నారు. నలుగురికి విడివిడిగా సమయం ఇచ్చారని, ఒక్కొక్కరికి అరగంట సమయం ఇచ్చారని స్పీకర్ ఎదుట తమ వాదన వినిపిస్తామన్నారు.
అనర్హత వేటు ఎందుకు వేయకూడదో చెప్పాలని కోరితే సమయం కావాలని తమని కోరారని, దీంతో స్వయంగా స్పీకర్‌ను కలిసి తమ ఆలోచనలు పంచుకుంటామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.తాను సమయం అడిగినా ఇవ్వలేదని, నేరుగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారన్నారు.
అనర్హత వేటు వేస్తామంటూ తమను పిలిపించారని, ఎలాంటి గడువు ఇవ్వలేదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యం సరిగా లేదని మెడికల్ సర్టిఫికెట్ పంపినా, ఖచ్చితంగా మాజరు కావాల్సిందేనని చెప్పారని, దాని ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు..
స్పీకర్ ఏకపక్ష చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం రెండు తర్వాత ఎమ్మెల్యేల పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. తమ వాదన వినికుండా ఏకపక్షంగా స్పీకర్ చర్యలకు సిద్ధమవుతున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనుమానిస్తున్నారు. స్పీకర్ జారీ చేసిన నోటీసుల్ని రద్దు చేయాలని హైకోర్టును కోరుతున్నారు.