AP Wine Shop Tenders 2024 : అంతా ఆఫ్‌లైన్.. ఆన్‌లైన్‌కు అడ్డంకులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
AP Wine Shop Tenders 2024 : ఏపీలో మరో కొత్త దందా తెరపైకి వచ్చింది. నూతన మద్యం విధానం ఇంకా అమల్లోకి రాకముందే.. కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే సిండికేట్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. వైన్ షాపులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
మద్యం వ్యాపారం.. ఏడాదంతా జోరుగా సాగుతుంది. గతంలో ఈ వ్యాపారం చేసినవాళ్లు రుచిమరిగి మళ్లీ ఇదే చేయడానికి ఎంతవరకైనా వెళుతున్నారు. తాజాగా ఏపీలో అదే జరుగుతోంది. గతంలో మద్యం వ్యాపారం చేసిన బడా బాబులు.. ఇప్పుడు భారీగా వైన్ షాపులను దక్కించుకునేందుకు అన్నీదారులు తొక్కుతున్నారు. అందితే కాలర్.. అందకపోతే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అటు ఎక్సైజ్ అధికారులు కూడా వీరికి సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
టెండర్ ప్రక్రియ, షాపుల కేటాయింపు పారదర్శకంగా జరగడానికి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో ఎక్కువగా ఆన్‌లైన్ దరఖాస్తులు రావాలి. కానీ.. విచిత్రంగా ఏపీలో ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దానికి కారణం.. ఎక్సైజ్ అధికారులు, టీడీపీ నేతలే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన షాపులు దక్కాలనే.. ఆన్‌లైన్ విధానంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇవిగో ఆధారాలు..
రాష్ట్రంలోని మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. ఇప్పటివరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 6 వేల 520 దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే వచ్చాయి. మొత్తంగా చూసినా.. ఒక్కో షాపు కోసం కనీసం 3 దరఖాస్తులు కూడా రాలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో షాపు కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి.. ఇప్పుడేంటి ఇలా తక్కువ వస్తున్నాయని చర్చించుకుంటున్నారు.
రంగంలోకి సిండికేట్ ముఠాలు..
గతంలో మద్యం దుకాణాలు నిర్వహించిన వారికి భారీగా లాభాలు వచ్చాయి. దీంతో మళ్లీ వీలైనన్ని ఎక్కువ షాపులు దక్కించుకోవడానికి కొందరు సిండికేట్‌గా ఏర్పడి.. ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులతో ముందే కుమ్మక్కై.. సాంకేతిక కారణాలతో అప్లికేషన్ ప్రాసెస్ కాకుండా చేస్తున్నారు. ఇక ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఎక్సైజ్ ఆఫీసులకు వచ్చేవారిని వీలైతే కొనేస్తున్నారు. లేకపోతే బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ నేతల హుకుం!
వైన్ షాపుల టెండర్లలో ఎక్కువ టీడీపీ కార్యకర్తలు, నాయకులకే దక్కేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారులపై ఒత్తడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే.. ఎక్సైజ్ అధికారులను పిలిపించి మరీ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. 'రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లోని వైన్ షాపులు మనవాళ్లకే రావాలి. ఆ షాపుల కోసం టెండర్లు వేసేవారికి ఎంతో కొంత ఇస్తాం. వీలైతే మీరు మాట్లాడండి.. లేకపోతే ఎవరు టెండర్ వేశారో వారి వివరాలు ఇవ్వండి.. మేము చూసుకుంటాం' అని ఆ ఎమ్మెల్యే ఎక్సైజ్ అధికారులతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఒక్కో షాపుకు ఒక్కో టెండర్ వేయాలంటే రూ.2 లక్షలు చెల్లించాలి. ఇది టెండర్ ప్రక్రియలో పాల్గొనడం కోసం కట్టే ఫీజు. ఇది నాన్ రీఫండబుల్. ఎన్ని ఎక్కువ దరఖాస్తులు వస్తే.. ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. కానీ.. సిండికేట్, పొలిటికల్ దందా కారణంగా దరఖాస్తులు తక్కువ వస్తున్నాయని.. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందనే వాదన ఉంది. షాపుల కోసం దరఖాస్తు చేయడానికి వచ్చేవారిని ఆపేసి.. వారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.