AP New Liquor Shops Notification : ఏపీలో నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ, నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ
AP New Liquor Shops Notification : ఏపీలో నూతన మద్యం షాపుల దరఖాస్తుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి ఈ నెల 9 వరకు కొత్త మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 11న 3396 లిక్కర్ షాపులకు లాటరీ తీస్తారు. అక్టోబర్ 12 నుంచి రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది.
ఏపీలో నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కొత్త షాపులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి సెప్టెంబరు 30,2026 వరకు కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3396 వైన్ షాపులకు లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఈ నెల 11న 3396 షాపులకు లాటరీ తీస్తారు. దరఖాస్తుదారులు రూ.2 లక్షలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలు వరకు నిర్ణయించారు.
ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ కు అనుగుణంగా మంగళవారం జిల్లాల్లో అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్‌లు జారీ చేయనున్నారు. నేటి 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది. గీత కులాలకు రిజర్వ్ చేసిన మరో 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయనున్న 12 ఎలైట్ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
12 ప్రీమియం స్టోర్లు
12 ప్రీమియం స్టోర్లను విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కడప, అనంతపురంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. వీటి లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి ఉంటుంది.
మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోదలిచిన వారు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంక్ చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఒకవేళ డీడీ తీస్తే నేరుగా ఎక్సైజ్ కేంద్రాల్లో అందించాలి. ఈ నెల 11న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొత్త షాపులకు లాటరీ తీసి, లైసెన్సులు కేటాయిస్తాయి. 12వ తేదీ నుంచి లైసెన్స్ దారులు కొత్త షాపులను ప్రారంభించుకోవచ్చు. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకూ ప్రస్తుతం ఉన్న దుకాణాలను కొనసాగిస్తామని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
నాలుగు శ్లాబుల్లో రుసుములు
వైన్ షాపులు ఏర్పాటు చేసే ప్రాంతంలోని జనాభాను బట్టి లైసెన్స్ రుసుమును నాలుగు శ్లాబుల్లో ఖరారు చేశారు. మొదటి ఏడాది 10 వేల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల వరకు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 65 లక్షలు.. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో సంవత్సరం ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచుతారు. లైసెన్స్ పొందిన వారు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించవచ్చు. మద్యం రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారులు 20 శాతం మేర మార్జిన్ ఇస్తారు. గతంలో 10 శాతం మార్జిన్ ఇచ్చేవారు. అన్ని బ్రాండ్లు ఉండేలా పారదర్శక మద్యం పాలసీ అందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని పేర్కొంది.