AP Govt : ఎక్సైజ్‌ శాఖలోని ‘సెబ్‌’ రద్దు - సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ-ao govt issued orders abolishing the special enforcement bureau ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt : ఎక్సైజ్‌ శాఖలోని ‘సెబ్‌’ రద్దు - సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

AP Govt : ఎక్సైజ్‌ శాఖలోని ‘సెబ్‌’ రద్దు - సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 11, 2024 06:06 PM IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెబ్ కోసం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేసింది. సెబ్‌ రద్దు కోసం కొద్దిరోజుల కిందటే ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

‘సెబ్‌’ రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు
‘సెబ్‌’ రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(SEB)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్‌ శాఖలో రిపోర్ట్‌ చేయాలని సెబ్‌ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

గత ప్రభుత్వంలో సెబ్ ఏర్పాటు…

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌, పోలీస్ శాఖల నుంచి సిబ్బందిని కలిపి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. మొదట్లో మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాటు సారా తయారీ నిరోధం, గంజాయి సాగు, రవాణాలను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటైన సెబ్‌ను తర్వాత ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాలకు కూడా విస్తరించారు.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించింది. మద్యం విక్రయాలను కట్టడి చేసే పేరుతో ధరలను రెండు రెట్లు పెంచేశారు. ఆ తర్వాత కొత్త పాలసీ పేరుతో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించి ధరలను భారీగా పెంచారు. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు గోవా నుంచి మద్యం పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

2021 కోవిడ్ సెకండ్ వేవ్ వరకు సెబ్‌ పెట్టిన కేసులతో వేలాది మంది కేసుల పాలయ్యారు. ఆంధ్రాలో మద్యం ధరలు భారీగా పెంచడంతో ఏపీ నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసేవారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అటు రాయలసీమలో కూడా వేలాది మంది మద్యం కోసమే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు. రైళ్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల్లో పెద్ద ఎత్తున మద్యం తరలించే వారు. వ్యక్తిగత వినియోగంతో పాటు బెల్టు షాపుల్లో విక్రయం కోసం ఇలా జిల్లాలు దాటే వారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సెబ్ చెక్‌పోస్టుల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

ఆ తర్వాత ఇసుక, మట్టి తవ్వకాల పర్యవేక్షణ బాధ్యతల్ని కూడా సెబ్‌కు అప్పగించారు. మొత్తంగా ఈ యంత్రాంగం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మాత్రమే వ్యాపారాలు నడిచేలా సహకరించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. దీంతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేబినెట్ భేటీలో చర్చించి… రద్దు నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు.

గత ప్రభుత్వ హయాంలో సెబ్ కోసం 4 వేలకుపైగా సిబ్బందిని సెబ్ కు కేటాయించారు. మిగతా వారిని ఎక్సైజ్ శాఖలోనే ఉంచారు. ఇప్పుడు సెబ్ రద్దు కావటంతో… గతంలో ఉన్న మాదిరిగానే ఎక్సైజ్ వ్యవస్థ ఉండనుంది. సెబ్ సిబ్బంది అంతా కూడా పాత విధానంలోనే పని చేయనుంది. వీరంతా ఎక్సైజ్‌ కమిషనర్‌ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేస్తారు.

Whats_app_banner