CBN Strategy: కంట్లో నలుసు, పంట్లో రాయి వంటి జగన్ విషయంలో చంద్రబాబు పంతం నెరవేరుతుందా?
CBN Strategy: పదేళ్ల తర్వాత కేంద్రంలో బీజేపీతో టీడీపీ జత కట్టింది. 2018లో బీటలు వారిన బంధాన్ని అతికష్టమ్మీద పునరుద్దరించారు. ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసలు లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
CBN Strategy: ఆరేళ్ల తర్వాత ఎన్డీఏ కూటమితో జత కట్టిన చంద్రబాబు అసలు లక్ష్యం మరొకటి ఉంది. రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు పంపి 53రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపేలా చేసిన జగన్‌పై టీడీపీ రగిలిపోతోంది.
బీజేపీతో టీడీపీ బంధానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నా ఈసారి మాత్రం చంద్రబాబు ప్రత్యేక డిమాండ్లను నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారనే అంచనాలు ఉన్నాయి. దేశంలో సంకీర్ణ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమికి, అంతకు ముందు ఐక్య కూటమి ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
2003లో చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టుల దాడి తర్వాత పరిణామాలతో ఆర్నెల్ల ముందే చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావించారు. అప్పటికే కేంద్రంలో బీజేపీ ఇండియా షైనింగ్ పేరుతో ప్రచారం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు ఒప్పించడంతో వాజ్‌పాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ఆర్నెల్ల గడువు మాత్రమే ఉండటంతో లోక్‌సభతో పాటు ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఈసీ తిరస్కరించింది.
2004లో ఓటమి పాలైన తర్వాత ఓటమికి మీరంటే కారణమని బీజేపీ, టీడీపీలు నిందించుకున్నాయి. గుజరాత్ అల్లర్ల ప్రభావమే టీడీపీ ఓటమికి కారణమని బీజేపీకి దూరమైన చంద్రబాబు పదేళ్ల తర్వాత 2014లో మళ్లీ ఆ పార్టీతో జట్టు కట్టారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని ఏపీలో అడ్రస్ గల్లంతైతే టీడీపీ-బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది.
నెరవేరని చంద్రబాబు అభీష్టం…
2009లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో చీలిక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు. ఎన్నికల నాటికి ఎన్డీఏతో కలిసి పోటీ చేసి గెలుపొందారు.
2014లో కేంద్రంలో ఎన్డీఏతో జత కలిసి ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా టీడీపీ జత కలిసింది. అదే సమయంలో ఏపీలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్ విషయంలో మాత్రం బీజేపీ నుంచి అప్పట్లో చంద్రబాబుకు ఆశించినంత సహకారం మోదీ నుంచి లభించలేదు.
మోదీ విషయంలో 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ఫలితామో, ఇతరత్రా కారణాలో తెలియకున్నా ఏపీ రాజకీయాల విషయంలో మోదీ జాగ్రత్తగా వ్యవహరించారు. 2014-18 మధ్య కాలంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినపుడల్లా జగన్ కేసుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే బీజేపీ పెద్దల నుంచి చిర్నవ్వు మాత్రమే బదులు వచ్చేదని, అది చంద్రబాబును నొప్పించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతాయి.
2014లో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ.. బీజేపీకి దగ్గర కావడం కూడా చంద్రబాబుకు రుచించలేదు. అదే సమయంలో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎంపిక సమాచారం ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ కంటే ముందే వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి వంటి వారికి తెలియడాన్ని అరుణ్ జైట్లీ వంటి వారిని చంద్రబాబు నిలదీయడానికి కారణమైంది. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైసీపీ వ్యూహాత్మక ఉద్యమించడం.. టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి సందేహాస్పదంగా ఉండటంతో 2018లో ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు వైదొలిగారు.
ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వంతు…
దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కలిశారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ చేరింది. చంద్రబాబు ప్రాధాన్యతల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహారమే ఖచ్చితంగా ముందుంటుందనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. చంద్రబాబును పంతం కొద్ది జైలుకు పంపిన జగన్‌పై బదులు తీర్చుకోవడంలో ఆలస్యం చేయకపోవచ్చు.
2014-19 మధ్య చంద్రబాబు కోరిక నెరవేరకపోయినా ఈసారి బాబు డిమాండ్లకు బీజేపీ సహకరించే అవకాశాలు లేకపోలేదు. పదేళ్లకు పైగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల వ్యవహారాన్ని తేల్చాలని బీజేపీపై ఒత్తిడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ పాలనా వ్యవహారాలు సజావుగా, ఎలాంటి అటంకాలు లేకుండా సాగాలంటే జగన్ రూపంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడొచ్చు.
ఏపీలో టీడీపీకి పూర్తి స్థాయిలో జవసత్వాలు కల్పించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ రాజకీయ వారసత్వాన్ని నారా లోకేష్‌కు అందించడానికి ముందే రాజకీయంగా ఉన్న అవరోధాలను తొలగించుకోడానికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ బాధ్యతల్ని లోకేష్‌కు అప్పగించడానికి అనువైన రాజకీయ వాతావరణాన్ని రూపొందించడం కూడా చంద్రబాబు ప్రాధాన్యతల్లో ఉండే అవకావం ఉంది.
సంబంధిత కథనం