YS Sharmila Entry: షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో ఎవరికి లాభం.. ఎవరికి ఖేదం?-who will benefit from sharmilas entry into the congress party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Entry: షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో ఎవరికి లాభం.. ఎవరికి ఖేదం?

YS Sharmila Entry: షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో ఎవరికి లాభం.. ఎవరికి ఖేదం?

Sarath chandra.B HT Telugu
Jan 16, 2024 01:37 PM IST

YS Sharmila Entry: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె రాకతో పార్టీ బలోపేతం అవుతుందని ప్రచారం ఓ వైపు, తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు మరోవైపు వినిపిస్తున్నాయి.

షర్మిల రాకపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు..!
షర్మిల రాకపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు..!

YS Sharmila Entry: ఏపీ కాంగ్రెస్‌లో వైఎస్‌ షర్మిల ఎంట్రీ ఖరారైంది. ఆమె రాక కాంగ్రెస్‌ పార్టీలో ఓ రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఆమె రాకతో తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకు వస్తున్నా అదే సమయంలో ఆ పార్టీనే అంటి పెట్టుకున్న నాయకుల్లో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

yearly horoscope entry point

వైఎస్‌.షర్మిల నిన్న మొన్నటి వరకు ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. మెట్టినింట్లో రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తానంటూ రెండేళ్ల క్రితం ఒంటరి పోరాటం ప్రారంభించారు.చివరకు ఎన్నికల్లో పోటీ చేయకుండానే తెలంగాణలో ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది. నేడో రేపో ఏపీలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

గిడుగు రాజీనామా…

వైఎస్‌ షర్మిలకు స్థానం కల్పించేందుకు పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. గిడుగు రాజీనామాతో బుధవారం జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీన మధుసూదన్ మిస్త్రీ ఆధ్వరన్యంలో అమరావతిలో ఏపీలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం గిడుగు రుద్రరాజు పదవి నుంచి తప్పుకోవడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు.

షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు అప్పగించడంపై మెజార్టీ కాంగ్రెస్‌ నాయకులు స్వాగతిస్తున్నా లోలోన తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన మాత్రం అందరిలో ఉంది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రత్యేకమైన వర్గం అంటూ ఏమి లేదు. ఒకప్పటి రాజశేఖర్‌ రెడ్డి వర్గం మొత్తం ఎప్పుడో వైఎస్‌ వెంట వెళ్లిపోయింది. ఏ పార్టీలోకి వెళ్లలేక కాంగ్రెస్‌ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న వాళ్లు పదేళ్లుగా పార్టీలో కొనసాగుతున్నారు.

అధ్యక్షులు మారినా….

ఈ పదేళ్లలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో ముగ్గురు అధ్యక్షుడు మారారు. మొదట్లో రఘువీరారెడ్డి ఆ తర్వాత సాకేశైలజానాథ్, ఆ తర్వాత గిడుగు రుద్రరాజు పిసిసి బాధ్యతలు నిర్వహించారు. గిడుగు రుద్ర రాజు పదవిలోకి వచ్చి 13నెలలు మాత్రమే అయ్యింది. ఈ పదేళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా కనుమరుగై పోయిందనే పరిస్థితి నుంచి అక్కడక్కడ మిణుకుమిణుకునే స్థితికి వచ్చింది. 2004-2014 మధ్య కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంతో ఎంతో మంది నాయకులు ఆర్ధికంగా రాజకీయంగా బలంగా ఎదిగారు. ఆ తర్వాత పరిణామాలతో వాళ్లంతా టీడీపీ, వైసీపీలకు వెళ్లిపోయారు.

విపక్షంలో ఎన్నో కష్టాలు…

ఈ పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విమర్శించడంతో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యాలయాలను స్థానిక యంత్రాంగం సీజ్‌ చేశారు. 1994 నుంచి పార్టీ కార్యాలయాలకు పన్నులు చెల్లించడం లేదని స్థానికి మునిసిపాలిటీలు భవనాలను జప్తు చేసేందుకు సిద్ధమైనపుడు కూడా కాంగ్రెస్‌లో పదవులు అనుభవించిన వాళ్లంతా పక్కకు తప్పుకున్నారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం కొంత సాయం చేస్తే ఐదారుగురు ముఖ్యమైన నాయకులు తలో చేయి వేసి పన్నులు చెల్లించాల్సి వచ్చిందని కాంగ్రెస్‌‌ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఎవరికి ప్రాధాన్యం….

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తే ఆమె ప్రాధాన్యతలు ఏముంటాయి, ఎవరికి సముచిత స్థానం దక్కుతుందనే ఆందోళన కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేకపోయినా బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో షర్మిల ఎవరిని ప్రోత్సహిస్తుంది, ఎవరిని పక్కన పెడుతుందోననే చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నా లేకపోయినా పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ జెండా మోసిన వారికి ఆంధ్రా కాంగ్రెస్‌ వ్యవహారాల్లో ఏ మేరకు ప్రాధాన్యత ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Whats_app_banner