Pawan Kalyan : ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తాం- పవన్ కల్యాణ్
Pawan Kalyan : భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యా్ణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ చేరుకున్న ఆయన భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.... ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద అన్నారు. అలాంటి వాటిని రక్షించుకునే అవగాహన ప్రభుత్వం లేదన్నారు. దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలకు చేరాయన్నారు. వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న పవన్... ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎర్రమట్టి దిబ్బల రక్షణపై వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తామని పవన్ తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
48 గంటల్లో చర్యలు చేపట్టాలి
ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం 48 గంటల్లో చర్యలు తీసుకోవాలన్నారు. వేల సంవత్సరాలుగా ఎర్రమట్టిదిబ్బలు సహజసిద్దంగా ఏర్పడ్డాయని, వైసీపీ నేతలకు వీటిని కాపాడుకోవాలన్న కనికరంలేకుండా విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో మట్టి తవ్వకానికి వీఎంఆర్డీఏకు ఏం అవసరమని ప్రశ్నించారు. కలెక్టరేట్ ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు. 1200 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలను నేవీకి ఇస్తే చివరకు 292 ఎకరాలు మిగిలిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీటిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ వారసత్వ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వీటికి కచ్చితంగా బఫర్ జోన్ ఉంటాలని సూచించారు. వైసీపీకి మట్టి డబ్బుల్లా కనిపిస్తుందని ఆరోపించారు.
గన్నవరం నుంచి విశాఖకు
అంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పవన్ కల్యాణ్‌కు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘనస్వాగతం పలికారు. పంచకర్ల రమేష్ బాబు వెంట కోన తాతారావు, పీవీఎస్ రాజు, పసుపులేటి ఉషాకిరణ్ తో పాటు పలువురు జనసేన నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి షీలా నగర్ రోడ్డు మార్గంలో భీమిలి ఎర్ర మట్టి దిబ్బల వద్దకు చేరుకున్న పవన్ కల్యాణ్ వాటిని పరిశీలించారు.