Pawan Kalyan : వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ, దండుపాళ్యం బ్యాచ్ కి వీళ్లకి తేడా లేదు- పవన్ కల్యాణ్-visakhapatnam janasena chief pawan kalyan criticizes volunteer system again ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ, దండుపాళ్యం బ్యాచ్ కి వీళ్లకి తేడా లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ, దండుపాళ్యం బ్యాచ్ కి వీళ్లకి తేడా లేదు- పవన్ కల్యాణ్

Bandaru Satyaprasad HT Telugu
Aug 12, 2023 04:04 PM IST

Pawan Kalyan : వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ తీసుకువచ్చి నేరుగా ఇళ్లలోకి పంపిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పవన్ పరామర్శించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దండుపాళ్యం బ్యాచ్‌కు వాలంటీర్లకు పెద్ద తేడా లేదన్నారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పవన్ శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు తప్పులు చేస్తే అధికార పార్టీ నాయకులు పరామర్శకు కూడా రారా అని, తప్పు ఎవరు చేసినా తప్పే బాధ్యతగా వచ్చి పరామర్శించి భరోసా ఇవ్వలేరా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. పోలీసు వెరిఫికేషన్‌ లేకుండా, సర్టిఫికెట్లు తీసుకున్నారో లేదో తెలియదు, వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ తీసుకువచ్చి ఈ ప్రభుత్వం నేరుగా ఇళ్లలోకి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఏ సమయంలో ఎవరెవరు ఉంటారు? ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తారు? అన్న సమాచారం మొత్తం వారికి తెలిసిపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణం అన్నారు. ఇళ్లలో ఉండే పెద్దల వివరాలు తెలుసుకుని కరడుగట్టిన నేరాలకు పాల్పడే దండుపాళ్యం బ్యాచ్‌ కి వీళ్లకి తేడా ఏముందని ప్రశ్నించారు. శనివారం ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్‌ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ నేతలతో కలసి పవన్ పరామర్శించారు.

నేరుగా ఇళ్లలోకి పంపేశారు

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... వాలంటీర్ల వద్ద ప్రతి ఇంటి సమాచారం ఉంటుందన్నారు. ఏ సమయంలో ఎవరు ఇంట్లో ఉంటారు? అన్న వివరాలు వాలంటీర్‌ ముసుగులో సులువుగా తెలుసుకోగలుగుతున్నారున్నారు. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో తాటి కుండల్లో విషం కలిపేశాడు ఓ వాలంటీర్‌ అని తెలిపారు. సమాంతర వ్యవస్థలే ఇలాంటి దారుణాలకు కారణం అన్నారు. బెదిరింపులు, గొలుసులు తెంచుకుపోవడాలు లాంటి సంఘటనలు పెరిగాయన్న పవన్... ఇలాంటి నేరాలు గతంలోనూ ఉన్నాయన్నారు. అయితే వాలంటీర్లకు ఎలాంటి వేరిఫికేషన్‌ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగానికి సర్టిఫికెట్లు కావాలని, కానీ వాలంటీర్‌ వ్యవస్థకు ఎలాంటి క్వాలిఫికేషన్‌ ఉందో తెలియదన్నారు. చిన్న పరీక్ష రాయించి ఉద్యోగాలు ఇచ్చేశారని మండిపడ్డారు. నేరుగా ఇళ్లలోకి పంపేసేప్పుడు కనీసం పోలీసు ఎంక్వయిరీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వైసీపీ కార్యకర్త అయితే చాలు అన్నట్టు ఉద్యోగాలు ఇచ్చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిక్ష పడుతుందన్న భయం లేదు

కాకినాడలో వారాహి యాత్రలో శాలివాహన కుటుంబానికి చెందిన ఓ వయసు మళ్లిన జంట ఇలాంటి భయాన్నే వ్యక్తం చేశారని పవన్ అన్నారు. తప్పుడు పనులు చేస్తే బయటికి వచ్చేయొచ్చులే అన్న భావన ఇలాంటి పనులకు పురిగొల్పుతుందన్నారు. చట్టం బలంగా పని చేస్తుంది... శిక్ష పడుతుంది, తోలు తీసేస్తారు అన్న భయం ఉంటే తప్పుడు పనులు చేయడానికి ఆలోచిస్తారని, నేరాలు చేసే వారికి భయం ఉంటుందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ బలంగా పని చేస్తుందన్న భావన ప్రజల్లో ఉంటే ఇలాంటివి పునరావృతం కావని తెలిపారు. పిల్లలు వృద్ధిలోకి వచ్చి ప్రశాంతంగా గడపాల్సిన వయసులో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. వరలక్ష్మి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా నిలుస్తామన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని చాలా బాధ కలిగిందన్నారు. వీరి కుటుంబానికి న్యాయపరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానన్నారు.

Whats_app_banner