Visakha Cyber Crime : విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ-visakhapatnam cbi arrested five cyber criminals on online fraud case related to delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Cyber Crime : విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ

Visakha Cyber Crime : విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ

HT Telugu Desk HT Telugu
Sep 29, 2024 09:40 AM IST

Visakha Cyber Crime : విశాఖపట్నంలో ఐదుగురు సైబర్ నేరగాళ్లను సీబీఐ అరెస్టుచేసింది. దిల్లీలో నమోదైన ఓ కేసులో భాగంగా సీబీఐ శనివారం వీరిని అరెస్టు చేసింది. విశాఖలోని ఎండాడ‌లో ఉంటున్న ఈ ఐదుగురు…ఒక కాల్ సెంట‌ర్‌లో పనిచేస్తున్నారు. వీరంతా ఆన్‌లైన్‌లో మోసాల‌కు పాల్పడుతూ ప‌లువురి నుంచి డ‌బ్బు కాజేస్తున్నారు.

 విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ
విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ (HT_PRINT)

Visakha Cyber Crime : విశాఖ‌ప‌ట్నంలో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్లను సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీలో న‌మోదైన సైబ‌ర్ క్రైమ్ కేసుల్లో నిందితులుగా విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసింది. స్థానిక కోర్టులో హాజ‌రు ప‌రిచిన త‌రువాత‌, సీబీఐ త‌న క‌స్టడీలోకి తీసుకుంది.

దిల్లీలో సైబ‌ర్ కేసులు న‌మోదు అవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడుల‌ను నిర్వహించింది. అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నంలో శ‌నివారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఐదుగురు యువ‌కుల‌ను అరెస్టు చేసింది. వీరంతా స్నేహితులే. అంతేకాకుండా ఒకే చోట వీరంతా ప‌నిచేస్తున్నారు. వీరివ‌ద్ద నుంచి డివైజ్ లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలోని ఎండాడ‌లో నివాసం ఉంటున్న అక్షయ‌ ప‌త్వాల్‌, ధీర‌జ్‌జోషి, హిమాన్షుశ‌ర్మ, పార్త్‌బాలి, పి.న‌వీన్ చంద్ర ప‌టేల్ స్థానిక బిర్లా జంక్షన్ వ‌ద్ద ఉన్న ఒక కాల్ సెంట‌ర్‌లో ప‌ని చేస్తున్నారు. వీరంతా కొంత‌కాలంగా ఆన్‌లైన్‌లో మోసాల‌కు పాల్పడుతూ ప‌లువురి నుంచి డ‌బ్బు కాజేస్తున్నారు. దీంతో సీబీఐ, ఇత‌ర రాష్ట్రాల పోలీసుల‌తో క‌లిసి సంయుక్తంగా దాడులు చేసి, వీరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్ హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్లు, కీల‌క డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచారు. త‌రువాత ఐదుగురిని సీబీఐ త‌న క‌స్టడీలోకి తీసుకుంది. అలాగే సీబీఐ విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ప‌లు కాల్‌సెంట‌ర్లలోనూ త‌నిఖీలు నిర్వహించింది. మ‌రి కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని దిల్లీ సీబీఐ హెడ్ క్వాట‌ర్స్‌కు త‌ర‌లిస్తారా? లేక ఇక్కడే ప్రాంతీయ కార్యాల‌యంలోనే విచారిస్తారా? తెలియాల్సి ఉంది.

దేశంలో, రాష్ట్రంలోని సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి అమ‌యాక ప్రజ‌లు బ‌ల‌వుతున్నారు. సాధార‌ణ ప్రజ‌లు మొద‌ల‌కొని ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజినీర్లు ఇలా అన్ని వ‌ర్గాల ప్రజ‌లు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి, ల‌క్షల్లో డ‌బ్బును పోగోట్టుకుంటున్నారు.

సైబర్ నేరాల్లో యూపీఐ, క్రెడిట్‌కార్డు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు అత్యధికంగా ఉన్నట్లు లోక‌ల్ స‌ర్కిల్స్ స‌ర్వే నివేదిక స్పష్టం చేసింది. ఈ సంస్థ దేశ‌వ్యాప్తంగా 302 జిల్లాల నుంచి కొన్ని వేల మందిని స‌ర్వే చేయ‌గా ఈ వాస్తవాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్పడు అన్ని ప‌నుల‌కూ ఆన్‌లైన్ వేదిక కావ‌డం, పౌరుల డాటాను ర‌క్షించే స‌రైన వ్యవ‌స్థ లేక‌పోవ‌డంతో పాన్‌కార్డు, ఆధార్‌, మొబైల్ నంబ‌ర్‌, ఈ-మెయిల్‌, చిరునామ వంటి వ్యక్తిగ‌త స‌మాచారం విరివిగా లభించ‌డం వ‌ల్ల కూడా సైబ‌ర్ నేరాల‌కు కార‌ణం.

ఈ స‌ర్వే సంస్థలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది తాము, త‌మ కుటుంబ స‌భ్యులు క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మోస‌పోయామ‌ని, 36 శాతం మంది యూపీఐ లావాదేవీల్లో న‌ష్టపోయామ‌ని తెలిపారు. ప‌ట్టణ ప్రజ‌ల్లో ఎక్కువ శాతం పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట పంపిన లింక్‌లు, క్యూఆర్ కోడ్‌ల‌ను డ‌బ్బులు చెల్లించి మోస‌పోయిన‌ట్లు స‌ర్వే తెలిపింది.

జ‌న‌వరి నుంచి ఏప్రిల్ చివ‌రి వ‌ర‌కు నాలుగు నెలల్లోనే దేశ‌వ్యాప్తంగా రూ.1,770 కోట్లను సైబ‌ర్ నేర‌గాళ్లు దోచుకున్నారు. గ‌డిచిన ఐదేళ్లలో ఈ ఏడాది ఏప్రిల్ చివ‌రి నాటికి సుమారు 40 ల‌క్షల సైబ‌ర్ నేరాలు న‌మోదు అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్సరంలో బ్యాంకింగ్ మోసాలు రికార్డు స్థాయిలో 300 శాతం పెరిగిన‌ట్లు స‌ర్వే స్పష్టం చేసింది. మొత్తంగా గ‌త రెండేళ్లలో సైబ‌ర్ మోసాలు 700 శాతం పెరిగాయని తెలిపింది. ఈ నేప‌థ్యంలో సీబీఐ సైబ‌ర్ మోసాల కేసుల‌ను విచారిస్తోంది. అందులో భాగంగానే దేశ‌వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా దాడులు నిర్వహించి, ఐదుగురిని అరెస్టు చేసింది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం