Cyber Crime : ఉపాధ్యాయ దినోత్సవం రోజున సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నటీచర్.. పోలీసులమని చెప్పి..
Cyber Crime : శ్రీకాకుళం జిల్లాల్లో సైబర్ నేరగాళ్ల వలలో ఓ టీచర్ చిక్కుకున్నాడు. పోలీసునని చెప్పి ఒక్కదెబ్బకే దాదాపు రూ.2 లక్షలు లాగేశాడు. ఇంకా రూ.50 వేలు అడగ్గా.. తన వద్ద లేకపోవడంతో అప్పు కోసం సహచర ఉపాధ్యాయుడిని అడిగాడు. దీంతో ఆయన సలహా మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
కాశీబుగ్గుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. దీంతో రూ.1.90 లక్షల పోగొట్టుకున్నాడు. ఉపాధ్యాయుడి కుమారుడు భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని నంబర్ నుంచి ఉపాధ్యాయుడికి ఫోన్ వచ్చింది.
మీ కుమారుడు మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి డ్రగ్స్ కేసుల్లో దొరికాడని.. తాము మీ కుమారుడిని అరెస్టు చేశామని చెప్పారు. తాను పోలీస్ శాఖలో పని చేస్తున్నానని.. కొంత డబ్బులు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామని చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయుడు.. ఆ సైబర్ నేరగాడి మాయ మాటలు నమ్మి.. కనీసం కుమారుడికి కూడా ఫోన్ చేయకుండా.. మూడు గంటల్లోనే రూ.1.90 లక్షల నగదను ఆ సైబర్ నేరగాడికి పంపించాడు.
ఆ సైబర్ నేరగాళ్లు ఇంకా రూ.50 వేలు పంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీ అబ్బాయిపైన ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందని ఆ ఉపాధ్యాయుడిని బెదిరించారు. రూ.50 వేలు పంపిస్తే విడిచిపెట్టేస్తామని స్పష్టం చేశారు. అప్పటికే ఆ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా ఖాళీ కావడంతో.. అప్పు కోసం సహచర ఉపాధ్యాయుడిని అడిగారు. ఎప్పుడు అప్పు అడగని ఆ టీచర్.. ఒక్కసారిగా అప్పు అడగడం, అందులోనూ ఆయన గందరగోళంగా ఉండటం చూసి సహచర ఉపాధ్యాయుడికి అనుమానం వచ్చింది.
దీంతో తోటి ఉపాధ్యాయుడు ఆరా తీశాడు. అసలేం జరిగిందని ప్రశ్నించారు. జరిగిన మొత్తం విషయం తోటి ఉపాధ్యాయుడికి వివరించాడు. ఆ ఉపాధ్యాయుడికి అనుమానం వచ్చింది. ఇదేదో మోసమని అనుమానంతో సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఉపాధ్యాయుడు ఆ నెంబర్‌కు ఫోన్ చేసి ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. మోసపోయామని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.
( జగదీశ్వరరావు జరజాపు- హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )