Visakhapatnam : విశాఖకు మరో వందేభారత్.. సెప్టెంబర్ 15న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Visakhapatnam : ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ అందించింది. విశాఖపట్నానికి మరొక వందేభారత్ రైలు రానుంది. ఇది విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడవనుంది. ఈ రైలు 5 స్టేషన్లలో ఆగనుంది.
విశాఖకు మరో వందేభారత్ రైలు రానుంది. సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచే ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. అయితే సెప్టెంబర్ 15న ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తోంది. ఆ తరువాత నుంచి దుర్గ్ (ఛత్తీస్‌గఢ్)- విశాఖపట్నం మధ్య రాకపోకలు నిర్వహిస్తోంది.
గురువారం మినహా ప్రతి రోజు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అంటే వారానికి ఆరు రోజులు ఈ రైలు విశాఖపట్నం - దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనుంది. ఉదయం ఆరు గంటలకు దుర్గ్‌లో బయలుదేరి రాయపూర్, లఖోలి, టిట్లాఘర్, రాయగడ, విజయనగరం మీదుగా మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది.
ఈ రైలు బాధ్యతలను ఆగ్నేయ మధ్య రైల్వేలోని రాయపూర్ డివిజన్‌కు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాలో ఎక్కువ స్టేషన్లలో నిలిపేలా ఏపీలో తక్కువ స్టేషన్లలో ఆగేలా మార్గం ఖరారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ రైలు ఒరిస్సాలోని రాయగడ తరువాత మధ్యలో ఏపీ చెందిన ప్రధాన స్టేషన్లు ఉన్నప్పటికీ విజయనగరంలో మాత్రమే ఆగుతోంది. ఆ తరువాత విశాఖపట్నంలోనే చివరి స్టాప్ ఉంటుంది.
రెండు ప్రత్యేక రైళ్లు రద్దు..
వివిధ కారణాల వల్ల ప్రత్యేక రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ ఎస్‌డీసీఎం కే. సందీప్ తెలిపారు. అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 1 వరకు తిరుపతి నుండి బయలుదేరే తిరుపతి - శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07440) రైలు రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్ -తిరుపతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07441) రైలు అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు రద్దు చేశారు.
కేకే లైన్‌లో కోచింగ్ రైళ్ల షార్ట్ టెర్మినేషన్..
కేకే లైన్‌లోని బచేలి, కిరండూల్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కోచింగ్ రైళ్లు షార్ట్‌టర్మినేట్ చేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ తెలిపారు. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ (08551) రైలు సెప్టెంబర్ 18 వరకు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08552) రైలు సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి ప్రారంభమవుతుంది.
విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ (18514) రైలు సెప్టెంబర్ 18 వరకు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18513) రైలు సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి ప్రారంభమవుతుంది. అందువల్ల ఆయా తేదీల్లో కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సేవలు ఉండవు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు చేసుకోవాలని సూచించారు.
భువనేశ్వర్ స్టేషన్‌లో రైళ్ల రీ షెడ్యూల్..
పూణే - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22881) రైలు సెప్టెంబర్ 19న పూణేలో బయలుదేరి.. సాయంత్రం 4:45 గంటలకు బదులుగా సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (12829) రైలు సెప్టెంబర్ 20న ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బయలుదేరి.. ఉదయం 5:55 గంటలకు బదులుగా ఉదయం 6:10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలు సెప్టెంబర్ 22న సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3.40 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుపతి - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22880) రైలు సెప్టెంబర్ 22న తిరుపతిలో బయలుదేరి ఉదయం 5:55 గంటలకు బదులుగా ఉదయం 6:10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుపతి - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22872) సెప్టెంబర్ 23న తిరుపతిలో బయలుదేరి ఉదయం 5:55 గంటలకు బదులుగా ఉదయం 6:10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)