VJA Kidney Racket: విజయవాడలో అంతే, పోలీసుల కనుసన్నల్లోనే అవయవాల వ్యాపారం, మరోసారి వెలుగు చూసిన కిడ్నీ రాకెట్
VJA Kidney Racket: పోలీసులు సాక్షిగా బెజవాడలో కిడ్నీ మార్పిడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది అక్రమ అవయవాల మార్పిడి చేసే ఆస్పత్రులతో పోలీస్ అధికారులు కుమ్మక్క దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి.
VJA Kidney Racket: విజయవాడలో అక్రమ అవయవ మార్పిడి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. గత ఏడాది వెలుగు చూసిన అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం మరుగున పడకముందే మరో బాధితుడు వెలుగులోకి వచ్చాడు. ఈ దందాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐపీఎస్ అధికారుల సహకారం ఉండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
గత ఏడాది విజయవాడ స్వర ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారం వెలుగు చూసిన సమయంలో విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులుగా ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు చక్రం తిప్పారు. ఆస్పత్రి యాజమాన్యంలో ఉన్నవైద్యుడి బంధువైన వైసీపీ ప్రజాప్రతినిధి.. కులానికి చెందిన ఐపీఎస్ అధికారి ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకుని సెటిల్ చేశాడు. పోలీస్ శాఖను నడిపించే ముఖ్యమైన అధికారులు స్వయంగా రంగంలోకి దిగడంతో కేసు కాస్త జావగారిపోయింది.
తాజాగా మరోసారి కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి వచ్చింది. అవయవ మార్పడి వ్యవహారంలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని ఫ్యామిలీ ఫ్రెండ్ పేరుతో ఓ యువకుడి కిడ్నీ కాజేశారు. ఈ వ్యవహారంలో తమకేమి సంబంధం లేదని ఆస్పత్రి చెబుతున్నా విజయవాడలో యథేచ్చగా సాగుతున్న అక్రమ అవయవాల మార్పిడి దందాకు తాజా ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చూసి కిడ్నీ విక్రయించందుకు సిద్ధపడ్డాడు. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేయడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు.
ఏమి జరిగిందంటే…
గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన నేలపాటి మధుబాబు కిడ్నీని కాజేసిన ముఠా ఇస్తామన్న డబ్బులు మాత్రం ఇవ్వలేదు. 15ఏళ్లుగా గుంటూరులోని చుట్టుగుంటలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న మధుబాబు కుటుంబాన్ని పోషించుకునే వాడు. కూరగాయల వ్యాపారం, నూడిల్స్ బండి వంటి చిరు వ్యాపారాలు చేసే మధుబాబు కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయాడు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. లోన్ యాప్‌లలో కూడా అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి సతమతమవుతున్న సమయంలో కిడ్నీ డోనర్ కావాలని ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసి స్పందించాడు.
దానికి బదులిచ్చిన బాష అనే వ్యక్తి కిడ్నీ దానం చేస్తే డబ్బులిస్తామని ఆఫర్ చేశాడు. రూ.30లక్షలకు కిడ్నీకి చెల్లిస్తామని చెప్పాాడు.అప్పులు తీర్చుకోవడంతో పాటు కుటుంబాన్ని పోషించుకోవచ్చని భావించిన మధుబాబు అందుకు సమ్మతించడంతో మధ్యవర్తిగా భాషా అనే వ్యక్తిని పరిచయం చేశాడు. వారిద్దరు కలిసి కిడ్నీ అవసరమున్న రోగి బంధువు సుబ్రహ్మణ్యం వద్దకు మధుబాబును తీసుకు వెళ్లారు. వైద్య పరీక్షల్లో మధుబాబు కిడ్నీ రోగికి సరిపోతుందని తెలియడంతో మొదట రూ.50వేలు చెల్లించారు.
జీవన్‌దాన్ పాత్ర ఎంత…?
జీవన్‌దాన్ నియమనిబంధనల ప్రకారం అవయవ మార్పిడి చేయాలన్నా, దాతల నుంచి స్వీకరించాలన్నా కుటుంబ సభ్యులు, కుటుంబ మిత్రులై ఉండాలి. ఈ క్రమంలో మధుబాబును రోగి కుటుంబ మిత్రుడిగా చూపించారు. ఇందుకు అవసరమైన పత్రాలను సృష్టించారు. జూలై 15న విజయవాడలోని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ శరత్ కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. మధుబాబు నుంచి స్వీకరించిన కిడ్నీని కేతినేని వెంకటస్వామి అనే వ్యక్తికి అమర్చారని బాధితుడు చెబుతున్నాడు.
బాధితుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో అతనికి అవసరమైన నకిలీపత్రాలను నిందితులే సృష్టించారు. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న రూ.30లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.50వేలు మాత్రమే ఇచ్చారని బాధితుడు వాపోయాడు. శస్త్ర చికిత్సకు ముందు బాధితుడి ఎడమ కిడ్నీ తీసుకుంటామని చెప్పినా చికిత్స సమయంలో కుడివైపు కిడ్నీ తొలగించారు. ఇదేమటని ప్రశ్నిస్తే వైద్యుడు శరత్‌బాబు తనను బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు.
ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చిన బాషా (9390003970), మధ్యవర్తి వెంకట్ ఫోన్ నంబర్ ద్వారా (8833269399) తనతో మాట్లాడారని తెలిపాడు. రోగి బావ నిమ్మకాయల సుబ్రహ్మణ్యం ఆన్లైన్‌లో రూ50వేలు పంపి నమ్మకం కలిగించారని తెలిపాడు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో తనకు రావలసిన మొత్తం ఇవ్వాలని అడిగితే... ఇష్ట మయ్యే కదా కిడ్నీ ఇచ్చావు' అన్నారని, గట్టిగా అడిగితే కిడ్నీలు తీసిన వాళ్లకు ప్రాణాలు తీయడం లెక్క కాదని బెదరించారని ఆరోపించాడు. తనను మోసం చేసిన బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యం, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శరత్ బాబు, వెంకట స్వామిలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని మధుబాబువిజ్ఞప్తి చేశాడు. విజయవాడలోని శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మరో ఆస్పత్రిలో ప్రతినెల 5-10 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.
ప్రభుత్వ అనుమతితోనే శస్త్రచికిత్స…
కిడ్నీ మార్పిడి వ్యవహారంలో నగదు వ్యవహారంతో తమకు సంబంధం లేదని డాక్టర్ శరత్ చెబుతున్నారు. జీవన్‌దాన్ అనుమతి వచ్చిన తర్వాతే తాము ఆపరేషన్ చేశామని వైద్యుడు చెబుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోవడంతో ఫ్యామిలీ ఫ్రెండ్ పేరుతో తీసుకురావడంతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కమిటీకి నివేదించిన తర్వాత సర్జరీ చేశామని డబ్బులు చెల్లింపుతో తమకు సంబంధం లేదన్నారు. ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేశామని తాము డబ్బులు తీసుకోలేదన్నారు.
కృష్ణా జిల్లా బంటు మిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశామని వెంకటస్వామి కుటుంబ మిత్రుడైన మధుబాబు దానం చేసినట్టు చెబుతున్నారు.
అక్రమ అవయవాల దందాలో పోలీసులదే కీలక పాత్ర…
అక్రమ అవయవాల మార్పిడి వ్యవహారాలు వెలుగు చూసినపుడు పోలీసుల పంట పండుతోంది. కేసును తారుమారు చేసి బాధితుల నోరు నొక్కేసి అసలు దోషులు బయట పడకుండా చేయడంలో కొందరు సూపర్ కాప్‌లు సిద్ధహస్తులుగా మారారు. సోషల్ మీడియాలో హీరో ఇమేజ్ కలరింగ్ ఇచ్చుకునే ఐపీఎస్‌లపై ఈ తరహా ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం