Vijayawada To Mumbai Flight : ఏపీ వాసులకు శుభవార్త, విజయవాడ-ముంబయి మధ్య ఎయిర్ ఇండియా డైలీ సర్వీస్
Vijayawada To Mumbai Flight : విజయవాడ-ముంబయి మధ్య ఎయిర్ ఇండియా నూతన సర్వీస్ నడపనుంది. నేటి నుంచి ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. జనసేన ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నూతన విమాన సర్వీస్ ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Vijayawada To Mumbai Flight : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పని మొదలుపెట్టింది. కొత్తగా ఏర్పడిన మంత్రి వర్గం తమ శాఖలపై సమీక్షలు చేస్తూ...అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడుల అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. విజయవాడ నుంచి ముంబయికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జనసేన ఎంపీ బాలశౌరి చొరవతో ఈ సర్వీస్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఎంపీ బాలశౌరి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఛైర్మెన్ గా ఉన్నప్పుడు విజయవాడ, ముంబయి మధ్య డైలీ సర్వీస్ ప్రారంభించాలని సంబంధిత శాఖ మంత్రులు, అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ-ముంబయి మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యింది.
ఎంపీ బాలశౌరి చొరవ
గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి జూన్ 15, 2024 నుంచి కొత్త విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో ఈ విమాన సర్వీసును ప్రారంభం అయ్యిందని, ఎంపీ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పరిసర ప్రాంతాల్లోని బిజినెస్ మెన్, వ్యాపారస్తులు తమ అవసరాల నిమ్మిత్తం విజయవాడ నుంచి ముంబకి, ముంబయి నుంచి విజయవాడ ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫ్లైట్ శనివారం సాయంత్రం 5.45నిమిషాలకు ముంబయి నుంచి విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 7.10 గంటలకు విజయవాడ నుంచి ముంబయికి అదే విమానం బయలుదేరుతుంది. విజయవాడ నుంచి ముంబయికి సర్వీస్ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
180 మంది ప్రయాణికులతో డైలీ సర్వీస్
శనివారం గన్నవరం విమానాశ్రయంలో కొత్త విమాన సర్వీసును ఎంపీ బాలశౌరి ప్రారంభించనున్నారు. ఈ విమానాన్ని ప్రతిరోజూ నడపనున్నారు. ఈ విమానంలో 180 మంది ప్రయాణించవచ్చు. కొత్త విమాన సర్వీసుల కారణంగా వ్యాపారస్తులకు ప్రయాణం సులభం కానుంది. వాణిజ్య కేంద్రమైన ముంబయి నగరానికి ఏపీ నుంచి వ్యాపారులు నిత్యం ప్రయాణిస్తుంటారు. గతంలో విమాన ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. ఎయిర్ ఇండియా నూతన సర్వీస్ తో ఆ సమస్యలు తగ్గాయి. దీంతో విజయవాడ, ముంబయి మధ్య ప్రయాణించే వారి ప్రయాణ సమయం, ఖర్చులూ తగ్గాయి. అంతేకాకుండా కనెక్టివిటీ పెరగడంతో పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని ఏపీ వాసులు భావిస్తున్నారు. దీంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
సంబంధిత కథనం