AP Anganwadi Protest : అంగన్వాడీలకు ఏపీ సర్కార్ అల్టిమేటం, సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే తొలగించాలని ఆదేశాలు-vijayawada news in telugu ap govt serious on anganwadis protest terminate orders released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Anganwadi Protest : అంగన్వాడీలకు ఏపీ సర్కార్ అల్టిమేటం, సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే తొలగించాలని ఆదేశాలు

AP Anganwadi Protest : అంగన్వాడీలకు ఏపీ సర్కార్ అల్టిమేటం, సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే తొలగించాలని ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 22, 2024 02:30 PM IST

AP Anganwadi Protest : సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ సాయంత్రంలోగా విధుల్లో చేరని వారిని ఉద్యోగాల్లోంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో అంగన్వాడీల సమ్మె
ఏపీలో అంగన్వాడీల సమ్మె (twitter)

AP Anganwadi Protest : అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్మా చట్టం ప్రయోగించినా విధుల్లో చేరకపోవడంతో అంగన్వాడీలను తొలగించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇంటికి పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 25న అంగన్వాడీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి సచివాలయాల్లో ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. పలు దఫాలుగా ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. దీంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.

yearly horoscope entry point

సమ్మెపై పట్టువీడని అంగన్వాడీలు

అంగన్వాడీలు విజయవాడకు రావడంపై సీరియస్ అయిన ఏపీ సర్కార్... వారిని వెంటనే తొలగించాలని కలెక్టర్లను ఆదేశించింది. అంగన్వాడీల సేవలను అత్యవసర సేవలుగా పరిగణిస్తూ వారి సమ్మెపై ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించింది. ఎస్మా చట్టం ప్రకారం ఇప్పటికే అంగన్వాడీలకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నోటీసులకు అంగన్వాడీలు ఇచ్చిన సమాధానంపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదని అధికారులు అంటున్నారు. అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం అవ్వడంతో, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు పట్టుబట్టారు.

అర్ధరాత్రి నుంచి అరెస్టులు

ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను సీఎం జగన్ కు ఇచ్చేందుకు అంగన్‌వాడీలు 'చలో విజయవాడ' కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్వాడీలు విజయవాడకు రాకుండా పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచీ దీక్షా శిబిరాలను ఖాళీ చేయిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి బస్సుల్లో వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను కావలిలో పోలీసులు అడ్డుకున్నారు.

సీఎం క్యాంపు ఆఫీస్ మార్గాలు మూసివేత

అంగన్వాడీల చలో విజయవాడను పోలీసులు భగ్నం చేస్తున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు. విజయవాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాలను ముందుస్తు జాగ్రత్తగా మూసివేశారు. సీఎం ఇంటి చుట్టుపక్కల మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన పలువురు అంగన్వాడీలను అరెస్టు చేశారు. గుంటూరు వైపు నుంచి సీఎం నివాసం వైపు వస్తున్న అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలను కాజా టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విశాఖలో దీక్ష చేస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేసి స్టేషన్ కు తరిలించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు అంటున్నారు.

Whats_app_banner