Pawan Kalyan : నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై స్పందించొద్దు- అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్-vijayawada janasena chief pawan kalyan guided leader do not respond on personal criticism ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై స్పందించొద్దు- అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్

Pawan Kalyan : నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై స్పందించొద్దు- అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్

Bandaru Satyaprasad HT Telugu
Oct 21, 2023 08:20 PM IST

Pawan Kalyan : టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలు వద్దని జనసేన అధికార ప్రతినిధులకు పవన్ కల్యాణ్ సూచించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో అందరూ జాగ్రత్తగా మాట్లాడాలని తెలిపారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద మాత్రమే మాట్లాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నిర్ధిష్ట అభిప్రాయాలను వారికి తెలియచేశారు. ఈ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ “ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి. కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలి" అన్నారు.

yearly horoscope entry point

నిరంతర అధ్యయనం

ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలు మొదలగు ముఖ్యమైన అంశాలన్నింటిపైనా లోతుగా అధ్యయనం చేసి తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్లాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హానిచేసే విధంగా చర్చలు ఉండకూడదన్నారు. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా అవి ఉండాలన్నారు. మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. చర్చలో పాల్గొనే ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా తూలనాడినా సంయమనం పాటించాలని సూచించారు. ఆ క్షణంలో మనం తగ్గినట్టు కనబడినా ప్రేక్షకులు, సమాజం దృష్టిలో పెరుగుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పవన్ అన్నారు. గతంలో కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ వివిధ కులాలు, మతాలను ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి ఎత్తుగడలు వేసేవని, ప్రజలకు వాస్తవాలు చెబుదామని పవన్ అన్నారు.

వ్యక్తిగత విమర్శలు వద్దు

రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలో రూల్‌ ఆఫ్‌ లాకి అనుగుణంగా మన మాట, మన ప్రవర్తన ఉండాలని అధికార ప్రతినిధులకు పవన్ సూచించారు. చర్చల్లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడకపోవడంతో పాటు అవతలి వారి ఆహార్యం గురించో, బాడీ షేమింగ్‌ చేసే విధంగానో ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదన్న నియమాన్ని పాటించాలన్నారు. సోషల్‌ మీడియాకు అనవసరమైన ఇంటర్వూలు ఇవ్వొద్దని సూచించారు. వాటివల్ల కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉందన్నారు. పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్‌ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టొద్దని సూచించారు. పార్టీ ప్రతినిధులు కేవలం పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలని సూచించారు. మరెవరికో మద్దతుగా మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దని పవన్ అధికార ప్రతినిధులను కోరారు. స్పందించుకుంటూ వెళ్తే మన లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందన్నారు.

నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను

"జీరో బడ్జెట్‌ రాజకీయాలు అనే అంశం మీద నేను అభిప్రాయాలు చెప్పలేదు. అదెలా పుట్టిందో తెలియదుగానీ నేను జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ చేస్తానని ప్రచారం చేశారు. నేను అన్నది ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి. అంతేగానీ ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పనిచేయించుకోవడం గురించి కాదు. ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మన పార్టీ కమ్యునిస్టులతో కలసినా, బీజేపీతో కలసినా, టీడీపీతో పొత్తు ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే విషయాన్ని చర్చల్లో అవసరం అయిన సందర్భాల్లో ప్రస్తావించాలి. ఇతర పార్టీలతో జత కట్టకుండా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు ఉండవన్న విషయాన్ని మరచిపోవద్దు. అదే విధంగా ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికి నేను వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా వారు నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో కూడా మనం చెప్పలేం. ఒక్కోసారి మన ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని కూడా కలవాల్సిన సందర్భాలు కూడా రావచ్చు. అందువల్ల చర్చల్లో పాల్గొనే వారు కూడా సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేసి, చర్చలు ముగిశాక మంచిగా పలుకరించుకునే వాతావరణం ఉండాలి."- పవన్ కల్యాణ్

Whats_app_banner