Budameru Leakage : బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం-vijayawada floods budameru leakage stoppage work completed flood water decreasing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Budameru Leakage : బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం

Budameru Leakage : బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం

Bandaru Satyaprasad HT Telugu
Sep 07, 2024 02:14 PM IST

Budameru Leakage : బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆర్మీ సాయంలో పెద్దదైన మూడో గండిని శనివారం పూడ్చి వేశారు. ఇటీవల భారీ వర్షాలకు బుడమేరుకు మూడు చోట్ల గండి పడింది. ఈ గండ్ల వలన విజయవాడ ముంపునకు గురైంది.

బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం
బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం

Budameru Leakage : విజయవాడ నగరం ముంపునకు కారణమైన బుడమేరు మూడు గండ్లను పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన ఇరిగేషన్ అధికారులు...తాజాగా శనివారం మూడో గండిని పూడ్చివేశారు. దీంతో బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తయ్యాయిని అధికారులు తెలిపారు. 90 మీటర్ల మేర పడిన మూడో గండిని అధికారులు, ఆర్మీ సాయంతో పూడ్చారు. మొత్తం 3 గండ్లు పూడ్చడంతో దిగువ ప్రాంతాలకు వరద నీరు ఆగింది. ఐదు రోజులు నిరంతరాయంగా గండ్లు పూడ్చివేత పనులు కొనసాగాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పనులు పర్యవేక్షించారు.

ఇటీవల భారీ వర్షాలకు 60 వేల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు మూడు చోట్ల గండ్లు పడ్డాయి. ముంపు సమయంలోనే రెండు గంట్లు పూడ్చగా...తాజాగా మూడో గండిని ఏజెన్సీలు, ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూడ్చివేశాయి. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ జవాన్లు దాదాపు 120 మంది గండి పూడ్చివేతకు సహకరించారు.

ఇనుప జాలీల్లో రాళ్లను నింపి గండి పూడ్చివేత పూర్తి చేశారు. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణం ఉండే గాబియన్ బాస్కెట్‌లను ముందుగా ఒకదానిపై ఒకటి పెట్టి వాటిల్లో రాళ్లను నింపి గండికి అడ్డుకట్టగా వేశారు. 90 మీటర్లు ఉన్న మూడో గండిలో 40 మీటర్లను నిన్ననే పూడ్చివేశారు. తాజాగా మొత్తం గండిని పూడ్చడంతో విజయవాడలో బుడమేరు వరద తగ్గింది. ఇళ్లలో చేరిన బురదను ప్రజలు పరిశుభ్రం చేసుకుంటున్నారు. పారిశుద్ధ్య, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇంటింటికీ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారు.

బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం

బుడమేరు గండ్లు పూడ్చివేతతోనే మా పని అయిపోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మళ్లీ రెండో టాస్క్ ఇప్పుడే మొదలైందన్నారు. ఇప్పుడు వేసిన ఈ బండ్ ఎత్తు పెంచే పనులు కూడా వెంటనే చేపడుతున్నామన్నారు. రేగడిమట్టిని నింపి సీపేజీని కూడా పూర్తిగా అరికడతామన్నారు. మళ్లీ ఎంత పెద్ద వర్షం వచ్చినా, విజయవాడ ప్రజలను సేఫ్ గా ఉంచటమే మా ముందున్న లక్ష్యం అన్నారు.

"బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తి చేశాం. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డాం. సీఎం 24 గంటలు కలెక్టరేట్‍లో, క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పనులు పర్యవేక్షించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మా ప్రభుత్వం మొత్తం ప్రజా సేవలోనే ఉంది. ముఖ్యమంత్రి కలెక్టరేట్‍లో, మంత్రులు కట్టల మీద, ఎమ్మెల్యేలు లంకల్లో ఉండి, ప్రజల కోసం ప్రతి క్షణం కష్టపడ్డాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు మాకు ప్రజాసేవపై ఉండే నిబద్ధత."- మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడలో భారీ వర్షం

విజయవాడలో శనివారం మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుంది. ముంపు ప్రాంతాల్లో బురద తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం