Opinion: ఏ నమూనాతో బాబు ఏలుతాడో?-unpacking chandra babu leadership which model will he choose ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Opinion: ఏ నమూనాతో బాబు ఏలుతాడో?

Opinion: ఏ నమూనాతో బాబు ఏలుతాడో?

HT Telugu Desk HT Telugu
Jul 16, 2024 03:24 PM IST

నాలుగో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో ఏ నమూనా ఎంచుకోబోతున్నారు? సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి దిలీప్ రెడ్డి విశ్లేషణ..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (PTI)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గ‌డించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్‌కు రెండో సీఎం అయిన తాజా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు ఓ ‘వ్యాఖ్య’ చేశారు. ఆయనన్నట్టే... దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఫలితాలను (164/175) ఏపీప్రజలిచ్చారు, కానీ, జగన్ ఆశించినట్టు అది ఆయనకు అనుకూలంగా కాదు.

ఫలితంగా నారా చంద్రబాబునాయుడు నాలుగోమారు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. చంద్రబాబు నాయుడివి ప్రభావవంతమైన ఓ అరడజన్ ‘నమూనా’ (మాడల్స్) లైనా ఉండి ఉంటాయి. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో, దేశంలో మరే నాయకునికీ లేని... వైవిధ్యభరితమైన అనుభవాల నమూనాలు ఆయన ప్రస్థానంలో, స్పష్టమైన విభజన రేఖలతో మనకు కనిపిస్తాయి. అందులో ఏది ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుంది? అన్నది ప్రశ్న. ఆయన మాత్రం, ‘మీరు మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారు’ అని నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఎందుకాయన ‘1995 చంద్రబాబు’ అనే నమూనానే గుర్తుచేస్తున్నారు?అంటే, అది ఆయనకు కూడా నచ్చిన నమూనా అయి ఉంటుంది.

ఏపీ ప్రజలు నిజానికి ఏం కోరుకుంటున్నారు? ప్రజల ప్రస్తుత ఆకాంక్షలకు చంద్రబాబు-1995 నమూనా సరిపోతుందా? అందులో మార్పు గానీ, అదనంగా ఇంకేమైనా జోడింపు గాని కావాలా? అన్ని నమూనాల్లోంచి తీసుకోదగిన-తగని మంచి-చెడ్డ లేంటి? ఇవీ, ఇప్పుడు ప్రజల నోళ్ళలో నానుతున్న ప్రశ్నలు. వాటికి సమాధానాలు కావాలి.

‘ప్రభుత్వం`నెల పాలన’ను ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రత్యక్షంగా పరిశీలించిన ‘పీపుల్స్ పల్స్’ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆ కోణంలో చూసినప్పుడు, చంద్రబాబునాయుడి వచ్చే అయిదేళ్ల పాలనా తీరు ఏపీలో ఎలా ఉండొచ్చు? అన్న ప్రశ్న తలెత్తడం సహజం! అరవైలో ఇరవై అన్నట్టుగా 2024లో మనం ‘చంద్రబాబు-95’ ని చూడగలమా? అన్నదే ఇప్పుడు కీలకం!

చంద్రబాబు విభిన్న నమూనాలు ఎలా ఉన్నాయో గుర్తు తెచ్చుకుంటే.. నలుగురిలో నారాయణ (1978-83), మామ ఎన్టీయార్ నీడలో (1983-95), మామని కాదని, తానే..(1995-1999), కీర్తి కాంక్షాప్రచార యావలో (1999-2004), విపక్ష కేంద్రకం (2004-2014), ఆశా అలసత్వం నడుమ (2014-19), ఏలికను ఎండగడుతూ...(2019-2024). ఏం చేస్తారో..?? (2024-?). ఇవీ చంద్రబాబు వేర్వేరు నమూనాలు.

సమిష్టి నిర్ణయాలు-సత్ఫలితాలు

‘నేను మారాను, మీరూ మారండి’ అని తరచూ చెబుతుండే చంద్రబాబు నాయుడు నిజంగా మారారా? కాలమాన పరిస్థితులు, ప్రజల అవసరాలు-ఆకాంక్షలు, సందర్భాలను బట్టి ఆయన మారుతున్నారా? అన్నదొక సంక్లిష్ట ప్రశ్నే! దానికి, సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. ఆ దిశలో ఇప్పటివరకు పెద్దగా సంకేతాలు కూడా లేమీ లేవు. భవిష్యత్తులో ఉంటుందా అన్నది వేచి చూడాల్సిందే!

2019లో అంత ఘోరంగా తిరస్కరించిన ప్రజలు, బాబును మళ్లీ ఎన్నుకోవడానికి భీమవరంలో ఓ నడివయస్కుడు చెప్పిన కారణం హేతుబద్దంగానే ఉంది. ‘అవును, అప్పుడాయన పాలన సరిగా లేదని వద్దనుకున్నాం. మెరుగైన పాలనను వై.ఎస్.జగన్ నుంచి ఆశించి భంగపడ్డాం. అందుకే, సీఎంగా బాబున్నా కాస్త నయమయేదేమో అనుకున్నాం. కనుక మళ్లీ ఆయనకు పట్టం కట్టాం’ అన్నాడాయన.

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఏపీ తొలి ప్రభుత్వ (2014-19) అధినేతగా బాబు ప్రజలు ఆశించిన పాలనను అందించలేకపోయారు. విభజనతో మిగిలిపోయిన అవశేషాంధ్రప్రదేశ్, నిధులు లేక నీరసించిన దశ, అనుభవశాలి కనుక బాబు ఏదైనా చేసి రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టిస్తారని నమ్మిన ప్రజల ఆశలు... తర్వాతి కాలంలో అడియాసలయ్యాయి. ప్రభుత్వ అలసత్వం పెచ్చుమీరింది. ప్రజాసమస్యలకు పరిష్కారాలు దొరకలేదు. ప్రభుత్వంలో, పార్టీలో సంప్రదింపులు, సమిష్టి నిర్ణయాలు కరువయ్యాయి.

గతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. 1995లో అధికార మార్పిడితో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1994 ప్రజాతీర్పు ఎన్టీరామారావును గద్దెనెక్కించడం అయితే, దాన్ని వంచించి చంద్రబాబు దొడ్డిదారిన తాను ముఖ్యమంత్రి అయారనే ‘వెన్నుపోటు’ విమర్శల సుడిగుండంలో... తనను తాను నిరూపించుకోవాల్సిన సందర్భం!

జన్మభూమి, శ్రమదానం, ప్రజలవద్దకు పాలన.... ఇలా పలు కార్యక్రమాలతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లే కార్యాచరణ చంద్రబాబు చేపట్టారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో సంప్రదింపుల పర్వం జోరుగా సాగేది. అన్ని ముఖ్యమైన, విధానపరమైన అంశాలపై పార్టీ కార్యవర్గంలో, పొలిట్ బ్యూరోలో, మంత్రిమండలిలో, మంత్రివర్గ ఉపసంఘాల్లో చర్చ విస్తృతంగా జరిగేది. అంతిమంగా తాను కోరుకున్నదే జరిగినా, వివిధ స్థాయిల్లో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు.

సీనియర్ల అనుభవం, వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చే ఇన్పుట్స్ ప్రభుత్వ తుది నిర్ణయాలను మెరుగుపరిచేవి. పార్టీ విధానాలను సంస్కరించేవి. వివిధ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా దేవేందర్గౌడ్, కోడెల శివప్రసాదరావు, మాధవరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, విద్యాధరరావు, పుష్పరాజ్, చందూలాల్..... ఇలా ఒక బలమైన నాయక బృందం ఆయనకు నీడలా వెన్నంటి ఉండేది. వారంతా ఆయన విశ్వాసపాత్రులే!

ఘాటైన విమర్శల నడుమ కూడా ఆ తడవలోనే 1996, 1998 పార్లమెంటు ఎన్నికల్ని తెలుగుదేశం సమర్థంగా ఎదుర్కోగలిగింది. 1999లో చంద్రబాబు అధికారం నిలబెట్టుకునేలా చేసింది. అటువంటి ఓర్పు-నేర్పు ఇప్పుడాయన చూపగలరా? ముఖ్యంగా మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. ఇటు పార్టీ యంత్రాంగం అటు ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చూసుకొని జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. పనిలో పనిగా భాగస్వాములు. ఒక్క టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది అడిగారని తనపై ఉన్న ఒత్తిడి శాంపిల్‌ను చెప్పకనే చెప్పారు పవన్ కల్యాణ్.

బాబు మీద ఇప్పుడాయన ఒత్తిడి పెట్టదలచుకోలేదు కనుక సరిపోయింది. ఇదే సాఫీ స్థితి రేపు ఉంటుందనుకోలేం! మైనర్ పార్ట్‌నర్ బీజేపీ ప్రస్తుతానికి మౌనంగానే ఉంది. ఎన్నికల పొత్తుల్లో మిత్రులకిచ్చిన 8 లోక్సభ, 31 అసెంబ్లీ స్థానాల పరిధిలోని సొంత పార్టీ నాయకుల త్యాగాలకు బదులీయాలి. ఏదో రకంగా వారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది.

ఏమైనా.... బాబుకి సర్కస్లో తాడుమీద నడక లాంటిదే! అందుకే, 1995 చంద్రబాబును చూస్తారు అంటున్నారా? ఏమో.... వేచి చూడాలి. మాటలే తప్ప సంకేతాలయితే ఇప్పటివరకు లేవు. నిన్నటికి నిన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెంనాయుడి స్థానంలో పల్లా శ్రీనివాస్‌ను నియమిస్తే.... సంప్రదింపుల్లేవు, చర్చ లేదు. అంతా గోప్యం, ఏకపక్షమే! మరి, మారానంటే బాబును నమ్మేదెలా?

అధికారుల్లో నాడు పాదుకొల్పిన విశ్వాసం

ఇవాళ ‘రెడ్ బుక్’ సంస్కృతి వచ్చి పడింది కానీ, ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ‘ఉద్యోగమిత్ర’ గానే ఉండేది. ఆ పరంపర.. పార్టీని స్థాపించిన ఎన్టీయార్ హయాం నుంచే ఉంది. విభాగాల అధిపతులుగా, వివిధ హోదాల్లో పనిచేయడానికి బాబు మొదట్లో ఎంపిక చేసుకున్న అధికారులు కూడా అంతే నిబద్దత, విధేయతతో పనిచేసేవారు. తాను పాలనాపగ్గాలు చేపట్టిన ఆరంభదినాల నుంచే బాబు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తపడేవారు. దాంతో, తమ కింద వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత బలపడకుండా సదరు ఉన్నతాధికారులు చూసుకునేది.

సీఎంవోలో ఎస్వీప్రసాద్ వంటి అనుభవజ్ఞులతో పాటు లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, సూడాన్, ఉమామహేశ్వరరావు వంటి అధికారులుండేవారు. రాజకీయంగా, పాలనాపరంగా చిక్కులు తలెత్తకుండా చక్కటి సమన్వయంతో కొందరు అధికారులు ముఖ్యమంత్రికి తల్లో నాలుకలా వ్యవహరించేవారు. అధికారుల్లో అనుమానాస్పద ట్రాక్ రికార్డు ఉన్న వారికి ముఖ్యమైన పదవులు-హోదాలు ఆయన ఇచ్చేది కాదు, వారిని అప్రాధాన్య ఉద్యోగాల్లో నియమించేది. అంతే తప్ప గిట్టని అధికారులను కించపరిచే, చిన్నబుచ్చే, అవమానించే సంస్కృతి లేదప్పుడు.‘రెడ్ బుక్’ కక్షసాధింపులూ లేవు.

అధికారులతో ఏగడం పాలకులకు అంత ఆషామాషీ అంశం కాదు. సున్నితంగా-తెలివిగా నడపాల్సిన వ్యవహారమే! ఏపీలో నిన్నటి వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’ కింద బడులను బాగుచేసినా, దానిపై టీచర్లకు సదభిప్రాయమే ఉన్నా.... ప్రవీణ్ ప్రకాశ్ రూపంలో సీఎంవోలోని ఒక్క అధికారి నిర్వాకాల వల్ల వ్యతిరేక భావం వారిలో బలపడిపోయింది. సర్కారుకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసే పరిస్థితి! తదనుగుణంగానే మీడియా కథనాలు వచ్చేవి.

జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలపడటంలో ఇవన్నీ పనిచేశాయి. కానీ, అప్పట్లో వ్యతిరేకంగా మీడియా కథనాలు రాకుండా జాగ్రత్తపడాలని అన్ని స్థాయిల నాయకులు, అధికారులను చంద్రబాబు సదా అప్రమత్తం చేసేది. అదే చంద్రబాబునాయుడు, 1999 ఎన్నికల్లో గెలిచాక సీను మారింది. ఢిల్లీలో చక్రాలు తిప్పడం, ఐటీ ముఖ్యమంత్రి అనిపించుకోవడం, సీఈవోగా పిలిపించుకోవడం వంటి కీర్తి కాంక్ష-ప్రచార యావ పెరిగే వరకు నడక బాగానే ఉంది. తర్వాతే అధికార వ్యవస్థపై పట్టు చేజారింది.

బాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సంస్కరణలని, విజన్ 20-20 అని, ప్రభుత్వ ఉద్యోగుల్ని తగ్గించి అవుట్ సోర్సింగ్ పెంచాలని, విద్యుత్తు-ఆర్టీసీ వంటివి ప్రయివేటీకరించాలని, అన్నింటా నిర్వహణ చార్జీలు వసూలు చేయాలనీ… ఇలా రకరకాల ఆలోచనలు వచ్చాకే గ్రాఫ్ పడిపోయింది. చదువుల్లో ‘హ్యుమానిటీస్’ అనవసరం అనేదాయన. ఒక్క టూరిజం తప్ప ఏ ‘ఇజమూ’ లేదని వేదికలెక్కి చెప్పేది.

‘బాబు పచ్చి మోసగాడు`ప్రపంచబ్యాంకు జీతగాడు’ అనే విమర్శల్ని ఆ రోజుల్లో ఎదుర్కొన్నారు. ప్రపంచబ్యాంకు నిర్దేశాలకు లోబడి, ప్రజావ్యతిరేకంగా ఉన్నారనే భావన బాబు ప్రచురించిన ‘మనసులో మాట’తో దృవపడింది. దాంతో సర్కారుపై ప్రజావ్యతిరేకత బాగా పెరిగి, 2004లో ప్రభుత్వ పతనానికి దారితీసింది. అలా 1995-99 మొదటి విడత పాలన, తర్వాతి అయిదేళ్ల (1999-2004) పాలనకన్నా ఎన్నోరెట్లు మేలనే జనాభిప్రాయం బలప‌డింది.

పై నుంచి కిందివరకొక బంధం

తెలుగుదేశం అధినేతకు, తర్వాతి స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య కార్యకర్తలకు మధ్య ఇప్పుడు బలహీనమైన ఓ మొక్కుబడి బంధం కొనసాగుతోంది. ఇదివరకు అలా ఉండేది కాదు. వేర్వేరు స్థాయిల నాయకులు-కార్యకర్తల మధ్య ఓ పటిష్ట బంధం ఉండేది. పార్టీ వ్యవస్థ మీద అధినేతకు గట్టి పట్టుండేది. అధికార మార్పిడితో ఎన్టీరామారావును గద్దె దించిన తర్వాత వారికదొక అవసరం కావడం వల్లో, మరో కారణమో తెలియదు కానీ, 1995-1999 మధ్య టీడీపీ నాయకులు కలిసి కట్టుగా ఉండేవారు.

మంత్రులతో సహా ముఖ్యనాయకులు జిల్లాలకు వెళ్లినపుడు, అక్కడి పార్టీ కార్యాలయాలను వారు సందర్శించాలని బాబు పురమాయించేది. తానూ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని తరచూ సందర్శించేది. కొన్ని గంటల పాటు గడిపేది. ప్రభుత్వం-పార్టీ మధ్య గరిష్ట సమన్వయానికి కృషి చేసేది. శిక్షణా తరగతులు నిర్వహించేది. పార్టీ ప్లీనరీని ‘మహానాడు’ పేరిట పండుగలా జరిపేది. వీటన్నిటి కోసం చంద్రబాబు ప్రత్యేక శద్ద్ర తీసుకునేది.

ఎందుకో, 1999 గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీలో సంస్థాగత వ్యవహారాల తీరు మారింది. నాయక శ్రేణికి ప్రాధాన్యత తగ్గింది. 2014 గెలుపు తర్వాత ఇంకా దిగజారింది. సాంకేతికతను గరిష్టంగా వాడి టెలి కాన్ఫరెన్స్లు, వీడియో కాల్స్, గంటలు గంటలు ఏకపక్ష ప్రసంగాలు తప్ప నాయకులు, కార్యకర్తలకు అధినేత దర్శనాలే కరువయ్యాయి! సంప్రదింపుల సంస్కృతికి పూర్తిగా సున్నా చుట్టారు. తాజా గెలుపు తర్వాత పరిస్థితి ఏమైనా మారుతుందేమో చూడాలి.

కాలమహిమనేమో..? ఇదిప్పుడు దాదాపు అన్ని పార్టీల్లోనూ సాధారణ లక్షణమైనట్టుంది. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ జరిగిందదే అని నిన్నటి ఫలితాలు, తదనంతర పరస్థితులతో మరింత స్పష్టమైంది. కరడుకట్టిన అభిమానులో, వైఎస్ఆర్‌కు ఆయన కుటుంబానికి విధేయత చూపేవారో, వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులై కృతజ్ఞత చూపేవారో.... ఏదైతేనేం ప్రజలకైనా అధినేత వైఎస్ జగన్‌తో కొంత బంధం ఉందేమో కానీ, నాయకులకు అస్సలు లేదు.

కేవలం 11 సీట్లకు పరిమితం చేసేలా ఓ ఘోరమైన ఓటమి ఎదురైనా... రాష్ట్రంలో దాదాపు 40 శాతం ఓట్ల వాటా వైఎస్సార్సీపీకి లభించడం దీనికి సంకేతం! ‘పైన భగవంతుడున్నాడు, మధ్యలో తానున్నాను, అడుగున ప్రజలున్నారు.... చాలు! ఇంక, ఇతరేతర నాయకులతో ఏమి పని’ అనుకొని ఉంటారు. కలవాలి అనుకున్నపుడు కలిసే అవకాశం లేకపోవడం, చెప్పాలనుకున్నది చెప్పలేని పరిస్థితి! చెప్పినా.... వినే వినిపించుకునే, విని ఆచరించే వాతావరణమే కరువయిందనే భావన వైసీపీలో బలపడుతూ వచ్చింది. దాంతో నాయకులు కూడా అధినేతతో అంతే బంధంతో... అంటీ ముట్టనట్టున్నారు.

వంద కోట్ల రూపాయలు పార్టీ విరాళమిచ్చిన కార్పొరేట్ వ్యక్తిలాగే ఓ ఉపముఖ్యమంత్రి కూడా తమ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఎనిమిది మాసాలు నిరీక్షించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఇట్టే బోధపడుతుంది! ఓడిపోయినవారిలో... మంత్రులతో సహా అత్యధికులు ఇప్పుడు వై.ఎస్.జగన్‌ను నిందిస్తున్నారు. ఆయన- ఆయన వైఖరి, ఏకపక్ష నిర్ణయాల వల్లే తామంతా ఓడిపోయామనే భావన మెజారిటీ పోటీదారులు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దెబ్బతో తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడని అధినేతను బూతులు తిడుతున్న వారూ ఉన్నారు. ఈ జాడ్యం క్రమంగా ఇతర పార్టీలకూ పాకుతున్నట్టుంది.

పార్టీ సంస్థాగత వ్యవహారాలపై మళ్లీ గతంలోకి వెళితే.. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్‌లో పార్టీ నాయకులకు పెద్దపీట వేసిన చంద్రబాబు రెండో టర్మ్‌కు వచ్చే సరికి వైఖరి మార్చారు. పార్టీ సీనియర్లకు ఒకింత ప్రాధాన్యత తగ్గించి, తటస్థుల రాగం పట్టుకున్నారు. ఆ మేరకు రాజకీయంగా కొంత నష్టపోయారు. ఆ పరంపరలోనే విజయరామారావు, వైస్రాయ్ ప్రభాకరరెడ్డి, ఎన్. దుర్గ, శనక్కాయల అరుణ, పుష్పలీల వంటి వారు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి, నేతలై తెరపైకి వచ్చారు.

సీబీఐ డీజీగా చేసిన విజయరామారావుకు మంత్రిపదవి ఇచ్చి తనకు లేకుండా చేశారనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోపం, ఆయనను తెలంగాణ మలిదశ ఉద్యమానికి నేతృత్వం వహించేలా చేసింది. ఇక, దాని పర్యవసానాలు... జగమెరిగిన ఒక చరిత్ర! ఇప్పుడూ అటువంటి పోకడలే పొడచూపుతున్న జాడ! పార్టీ సంస్థాగత నిర్మాణం నుంచి మంత్రివర్గం కూర్పు వరకు సామాజిక సమీకరణాలను జాగ్రత్తగా మేళవిస్తూ సాగటం చంద్రబాబు శైలి.

కానీ, అందుకు భిన్నంగా ఈ సారి అడ్డదిడ్డంగా చేసేస్తున్నట్టు సంకేతాలున్నాయి. ఉదాహరణకి ఒక్క పాత గుంటూరు జిల్లా నుంచే... కేంద్రంలో సహాయమంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రివర్గంలో తనయుడు లోకేశ్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా కృష్ణదేవరాయలు... వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు!

పైగా, ఇది చాలదన్నట్టు రేపు చీఫ్ విప్ ఉద్యోగం కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన దూళిపాళ నరేంద్రకు ఇచ్చే ఆస్కారం ఉందని వార్తలొస్తున్నాయి. కొప్పుల వెలమలతో పోల్చినపుడు, కాళింగులకు తగిన ప్రాతినిధ్యం లభించలేదు, శ్రీకాకుళంలో తప్ప వేరే ఎక్కడా వారికి అవకాశాలు కల్పించలేరని విస్మరించినట్టున్నారు. వైసీపీలో తిరుగుబాటుకు జెండా ఎత్తిన నెల్లూరు (రూరల్) ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుర్తింపు రాలేదనే భావన ఉంది. రాయలసీమలోనూ... వైసీపీని సమర్థంగా ఎదుర్కోగల సామాజికవర్గాలకు, నిర్దిష్ట నాయకులకు ప్రాధాన్యత కల్పించలేదనే అభిప్రాయం ఉంది.

ప్రజాకేంద్రక పాలనే ఎజెండా

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించినట్టు 95 శాతానికిపైగా ఎన్నికల ప్రణాళికను అయిదేళ్లలో ఆయన అమలు చేశారు. హామీ ఇవ్వని వరాలను కూడా గుప్పించి, వాటి అమలూ క్రమం తప్పకుండా పాటించారు. దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లేట్టు ఆయన ‘బటన్’ నొక్కారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత! అడిగిన వారికి, అడగని వారికీ లబ్ది చేకూరుస్తూ భారీ నిధులు అలా సంక్షేమానికి వెచ్చించడం వల్ల ఏ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికీ నిధులు లేని పరిస్థితి!

చివరకు రోడ్ల మరమ్మత్తు వంటి కనీస మౌలిక సదుపాయాలనూ ఆయన పట్టించుకున్న పాపాన పోలేదనేదే ఆయన మీద ప్రధాన విమర్శ! మున్సిపాలిటీల్లో చెత్త ఎత్తడానికి కూడా ‘చెత్త పన్ను’ విధిస్తే తప్ప వ్యవహారం గడవని ఆర్థిక దుస్థితి! అది ప్రజాగ్రహానికి కారణమైంది. పాలకపక్షం నాయకులు ఎన్ని వేదికలెక్కి, ఎంతటి ప్రసంగాలు చేసినా.... సామాన్యులు గొంతెత్తి ‘అయిదేళ్లూ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లెందుకు రిపేర్ చేయలేదు?’ అంటే, సమాధానం చెప్పలేని దుస్థితి కల్పించారు. దీనికి తోడు, అధినేత ఏకపక్ష నియంతృత్వ వైఖరి, వైసీపీకి చెందిన స్థానిక నాయకుల ఆధిపత్య ధోరణి, ఎడనెడ దౌర్జన్యాలు, భూదందాలు-దురాక్రమణలు, ఇసుక ఇతర ఖనిజాల వంటి సహజవనరులు కొల్లగొట్టడం.... వెరసి ప్రజలకు గొంతువరకొచ్చింది.

ప్రజలు గద్దె దించిన నిన్నటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురించి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మధ్యతరగతి యువకుడి మాట సగటు జనాభిప్రాయాన్నే ప్రతిబింబిస్తోందా? ‘ఏమీ లేదు. తెలివిగా రాష్ట్రమంతటా భూమి సర్వే చేయించుకున్నారు. భూయాజమాన్య హక్కుల విషయంలో ఓ చట్టం తెచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారు. రేపు నెమ్మదిగా ప్రజల అందరి భూముల్నీ కుమ్మేస్తారు. లేకపోతే, తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన మన భూమి పాసుబుక్కుల మీద ఆయన ఫోటో ఏంటి? ఒరిజినల్ ఆయన ఉంచుకుంటాడట, నకలు కాపీ మన ముఖాన కొడతాడట..... ఇదా పద్దతి, తూ’ అని నిందించాడు. వయసులకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏపీ జనం ముక్తకంఠంతో వ్యతిరేకించిన అంశం ఏదైనా ఉందంటే ఇదే! పాసుబుక్కులపైన జ‌గ‌న్ ఫోటోను జీర్ణించుకోలేకపోవడమే కాక వారొకింత భయపడ్డారు కూడా! ప్రజల పేరు చెప్పి, వాళ్ల కేంద్రకంగా కాకుండా వారి మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే, ప్రజలెలా స్పందిస్తారో ఇదొక ఉదాహరణ మాత్రమే! జగన్ పాలన దేశంలో ఒక నమూనాగా నిలిచేదే!

ఏపీలోని సగటు మనిషి ఆలోచనల్లో..... విఫలమయ్యాడని 2019లో జనతిరస్కారానికి గురైన చంద్రబాబే నయమనిపించే పరిస్థితి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కల్పించిందే ! ఏమైతేనేం, అటు పవన్ కల్యాణ్‌తో, ఇటు బీజేపీతో బాబు జతకట్టిన కూటమికి ఏపీ ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఇప్పుడు, గత ప్రభుత్వం కన్నా భిన్నమైన పారదర్శక-జవాబుదారితనంతో కూడిన పాలనను అందించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు హిమాలయాల ఎత్తున ఉంటే, ప్రభుత్వ శ్రద్దాసక్తులు అట్టడుగు లోయల్లోకి జారిపోయిన 2014-19 నమూనా ఇపుడు అస్సలు పనిచేయదు.

ప్రపంచబ్యాంకు జీతగాడని జనవాణి మోతమోగిన 1999-2004 నమూనా మొదటికే మోసం తెస్తుంది. ప్రజల అభీష్టం పరిగణనలోకి తీసుకొని దీపం, ఆదరణ, ముందడుగు, చేయూత, రోష్ని వంటి సంక్షేమ పథకాలతో పాటు స్థానిక-రాష్ట్ర-జాతీయ రహదారుల వృద్ది, ఐటీ పారిశ్రామికాభివృద్ది వంటివి చేపట్టి ప్రజాకేంద్రక పాలనను చంద్రబాబు అందించగలిగిన నమూనానే జనం కోరుకుంటారు. అది తెలిసిన అనుభవజ్ఞుడు కనుకే బాబు, ‘మీరు మళ్లీ 1995 బాబును చూస్తారు’ అనే రాగం అందుకున్నారు.

1999 ఎన్నికల్లో బాబును ఓడించి తీరాలని పీసీసీ అధినేతగా డా.వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుదలగా ఉన్నా, గెలిచిపోతున్నామని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసినా... తుది ఫలితాల్లో 91/294 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రజాకేంద్రక పాలన అన్నపుడు సంక్షేమం-అభివృద్దిని సమన్వయపరచినప్పటికీ, పాలనలో, విధాన నిర్ణయాల్లో కుటుంబ జోక్యాల్ని ప్రజలు ఎంత వరకు ఆమోదిస్తారు? అన్నదీ ప్రశ్నగానే ఉంటుంది.

‘కుటుంబపాలన ముద్ర’ ప్రమాదకారి

కుటుంబ జోక్యాలను అనుమతించడం, అడ్డుకోవడంలోనూ.... 1995-99 కాలమే ఆదర్శంగా నిలుస్తుందా? రాజ్యాంగేతర శక్తిగా లక్ష్మీపార్వతి జోక్యాలు మితిమీరాయన్న వాదనే తెలుగుదేశం పార్టీలో 1995 చీలికకు, ప్రభుత్వ మార్పిడికీ కారణమైంది. చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలోగాని, తదనంతర కాలంలో కానీ … తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బామ్మర్ధి హరికృష్ణ తదితరుల పాత్రా ప్రమేయం విషయంలో బాబు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేది. అవసరానికి వారి సేవల్ని, సహాయాల్ని పొందినా... అసాధారణంగా అందలాలు ఇచ్చేది కాదు. ఈ విషయంలో కొన్నిసార్లు అవసరానికి మించిన అతిజాగ్రత్త ఆయనకే కుటుంబపరంగా ఇబ్బంది తెచ్చిపెట్టేది. అయినా ఆయన భరించేవారు.

సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడు అలిగి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరినపుడు కూడా బాబు ఒకటే చెప్పేవారు. కుటుంబ రాజకీయాలపై తనకు విశ్వాసం లేదని, తాను వారిని ప్రోత్సహించబోనని! కానీ, ఇప్పుడు లోకేశ్తో పాటు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, బామ్మర్థి, వియ్యంకుడైన సినీతార బాలకృష్ణ తదితరుల పాత్రా ప్రమేయం కొంత పెరిగింది. ప్రభుత్వ వ్యవహారాల్లో వారి జోక్యం ఏ మేరకు ఉంటుంది? అన్నది తరచూ చర్చకు వస్తోంది. ప్రజలు గమనిస్తూ ఉంటారు. అందులో అత్యధికుల పాత్ర ఎన్నికల ప్రచారం వరకేనని, పాలనలో జోక్యాలు ఉండవు అంటే ఎవరికీ ఇబ్బంది ఉండకపోవచ్చు.

అలనాటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్సార్‌ను మరిపించాలనుకున్నారేమో.... తండ్రీకొడుకులు ఇప్పుడొక కార్యాచరణ చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి వద్ద రోజూ ఉదయం ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తూ, మంత్రి లోకేశ్ ప్రజల నుంచి వినతులు-ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఏ హోదాలో వాటిని ఆయన సీఎం ఇంటివద్ద స్వీకరిస్తున్నారు? ముఖ్యమంత్రి తనయుడిగానా? ఒకానొక మంత్రిగానా? ప్రజలకు స్పష్టం చేయాలి.

ఒక మంత్రిగానే అయితే, అది లోకేశ్ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి ఇంటివద్దకైతే ప్రజలు ఆశ-నమ్మకంతో వచ్చి వినతి చేసుకుంటారనుకుంటే... దానికి లోకేశ్ మాత్రమే ఎందుకు స్వీకరించాలి? ఇవన్నీ, జనం మెదళ్లలో మెదిలే ప్రశ్నలు! ప్రజాకేంద్రక పాలన అందించే ప్రభుత్వమే అయితే, వారికి సంతృప్తి కలిగించే సమాధానం చెప్పాలి. నిర్భయంగా, బేషుగ్గా సమాధానం చెప్పుకోగలిగిన పనులనే ప్రభుత్వం తరపున చేపట్టాలి.

ఏపీలో రాబోయే అయిదేళ్ల పాలన 75 ఏళ్ల సీనియర్ నేత చంద్రబాబుకు, ఏ రకంగా చూసినా పరీక్షా కాలమే! 1996-99 రోజుల్లో కేంద్రంలో, అక్కడి ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు పోషించిన ‘కింగ్ మేకర్’ వంటి పాత్రకు ఆస్కారం మరో రూపంలో ఇప్పుడుత్పన్నమైంది. బీజేపీకి సొంతంగా తగిన నంబర్లు సాధించలేకపోయిన ఎన్డీయే నేత, ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా చంద్రబాబునాయడు, నితీష్ కుమార్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి. దాన్నుంచి రాష్ట్రానికి సాధించింది ఏమిటి? అనే ప్రశ్న బాబు నెత్తిపై ఎప్పుడూ వేళాడే కత్తే! రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారా? వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ‘ప్యాకేజీ’ తెస్తారా? విశాఖ ఉక్కును మనకే ఉంచుతారా? పోలవరం జాతీయహోదాతో సత్వరం పూర్తి చేస్తారా? ఆర్థిక ఊబిలోంచి ఏపీని గట్టెక్కించేలా ప్రత్యేక నిధులు తీసుకువస్తారా?

ఇలా ఏం చేసైనా తనదైన మార్కు చూపించాల్సిన ఒత్తిడి బాబుపై ఉంటుంది. ఇవన్నీ సాధించడానికి.... నమూనా ఏదైనా సరే, ప్రజాభీష్టం ప్రకారమే పాలన సాగాలి, అప్పుడే అది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అనిపించుకుంటుంది.

- దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ ఎనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ సర్వే సంస్థ

దిలీప్ రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్
దిలీప్ రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు, వ్యాఖ్యలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

Whats_app_banner