Conferred IAS: ఇద్దరు నాన్ రెవిన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా.. ఉద్యోగుల్లో చర్చ
Conferred IAS: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు నాన్ రెవిన్యూ క్యాడర్ అధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు డిఓపిటి ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 40మందికి పైగా వివిధ శాఖల అధికారులు కన్ఫర్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Conferred IAS: ఆంధ్రప్రదేశ్‌లో ఓఎస్టీలుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. కొద్ది నెలలుగా సాగుతున్న ప్రక్రియలో చివరకు ఇద్దరు అధికారులను ఐఏఎస్ వరించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న ధనుంజయ్ రెడ్డి ఓఎస్డీ నీలకంఠరెడ్డితో పాటు పులివెందుల ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ రెడ్డిలను ఎంపిక చేశారు.
ఐఏఎస్ హోదా కోసం అర్హత కలిగిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 40మంది అధికారులు కొద్ది నెలల క్రితం జిఏడికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ రకాల వడపోతల తర్వాత ఎంపిక ఉండటంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకున్నారు. అన్ని దశలు దాటుకున్న తర్వాత ముఖ్యమైన వ్యక్తుల ఆశీస్సులు ఉన్న వారికే హోదా లభించినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు పోస్టుల్లో ఒకే వర్గానికి ప్రాధాన్యత కల్పించడంపై ఇతర దరఖాస్తుదారులు పెదవి విరుస్తున్నారు.
కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కోసం నాన్ రెవిన్యూ క్యాడర్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో 20మంది పేర్లను జిఏడి సర్వీసెస్ షార్ట్ లిస్ట్ చేసింది. వారిలో ఐదుగురి పేర్లను సిఎస్ ఆధ్వర్యంలో డిఓపిటికి సిఫార్సు చేయడానికి ఎంపిక చేశారు. సిఎస్ ఎంపిక చేసిన జాబితాను సిఎంఓకు సిఫార్సు చేశారు. తుది జాబితాలో పేర్లు దక్కించుకున్న వారిలో ఇద్దరిని ముఖ్యమంత్రి కార్యాలయం ఎంపిక చేసింది.
ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి ఓఎస్టీగా పనిచేస్తున్న డాక్టర్ కె. నీలకంఠా రెడ్డి, పులివెందుల ప్రాంతీయాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న బొమ్మినేని అనిల్ కుమార్ రెడ్డిలను కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఎంపిక చేశారు.
కన్ఫర్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకునే నాన్ రెవిన్యూ అధికారులకు కనీసం మూడేళ్ల సర్వీసుతో పాటు కనీసం ఏడు క్రెడెన్షియల్స్ ఉండాలని చెబుతున్నారు. సర్వీస్ రికార్డు, పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది ఐఏఎస్ జాబితాలో నాన్ రెవిన్యూ విభాగంలో రెండు పోస్టులు మాత్రమే ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంది.
నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కింద ఐఏఎస్లుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు 85 శాతం రెవెన్యూశాఖ వారిని, మిగిలిన 15 శాతం ఇతర శాఖల వారిని ఎంపిక చేస్తారు. కన్ఫర్డ్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినపుడు రెవెన్యూ నుంచి వచ్చే వారికి మౌలిక పరీక్ష ఉండదు. ఇతర శాఖల వారికి మాత్రం పరీక్ష నిర్వహిస్తారు.
ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారిలో ఇద్దరు ఒకే సామాజిక వర్గం వారిని ఎంపిక చేయడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వారి నేరుగా సిఫార్సు చేయడంతోనే వారి ఎంపిక జరిగినట్లు చెబుతున్నారు. అనిల్ రెడ్డి పులివెందుల నియోజక వర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నీలకంఠ రెడ్డి సిఎంఓలో నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నారు.