Tirumala : అక్టోబరు 3 నుంచి తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు - టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు రకాల ప్రత్యేక ద్రర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా హాజరవుతారని టీటీడీ తెలిపింది. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది.
ఇందులో భాగంగా అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరంలోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
అక్టోబరు 4 నుంచి బ్రహ్మోత్సవాలు :
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగన్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసే పనిలో పడింది.అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.
వాహన సేవల వివరాలు :
- 04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
- 05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
- 06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,
- 07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
- మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,
- 08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం
- 09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,
- 10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,
- రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,
- 11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,
- 12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజుల్లో దాతలను దర్శనానికి అనుమతించనున్నారు.