Tirumala : శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు - టీటీడీ ఈవో-ttd eo syamala rao warned on stringent action against the shopkeepers if they sell articles with higher prices ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు - టీటీడీ ఈవో

Tirumala : శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు - టీటీడీ ఈవో

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 19, 2024 11:16 AM IST

Tirumala Tirupati Devasthanam Updates : టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు… సమీక్షలు, పర్యవేక్షణలు మొదలుపెట్టారు. తిరుమలలో నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దుకాణాలను పరిశీలిస్తున్న టీటీడీ ఈవో
దుకాణాలను పరిశీలిస్తున్న టీటీడీ ఈవో

TTD EO J Syamala Rao : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా వచ్చిన శ్యామలరావు… వరుస సమీక్షలు చేస్తున్నారు. భక్తుల ఇబ్బందులపై దృష్టిపెడుతూ… తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. తిరుమల వచ్చే భక్తులకు దుకాణదారులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు.

శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జె శ్యామల రావు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు కూడా పలు సూచనలు చేశారు.

శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు… జేఈఓ (విద్యా, వైద్యం) గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి గుణ భూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నంబర్-3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ -3 యాజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రూ.25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

అవన్నీ అవాస్తవం - టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వయోవృద్ధుల టికెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని టీటీడీ తెలిపింది. భక్తుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ వార్తలు పూర్తిగా అవాస్తమని పేర్కొంది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ అయ్యాయి. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు.

తిరుమలలోని నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org , https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, వసతి టికెట్ల కోటా విడుదల సమాచారాన్ని టీటీడీ ప్రకటించింది. టీటీడీ యాప్, వెబ్ సైట్ లో సెప్టెంబర్ కోటా వివరాలను వెల్లడించింది.

  • శ్రీవారి ఆర్జి సేవల టికెట్లు(కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, ఉదయం 10 గంటలకు
  • శ్రీవారి ఆర్జిక సేవ(వర్చువల్), కనెక్టడ్ దర్శనం కోటా టికెట్లు(కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, మధ్యాహ్నం 3 గంటలకు
  • తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల- జూన్ 22, ఉదయం 11 గంటలకు
  • వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు - జూన్ 22, మధ్యాహ్నం 3 గంటలకు
  • తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.300) - జూన్ 24, ఉదయం 10 గంటలకు
  • తిరుమల, తిరుపతి వసతి గృహాల టికెట్లు విడుదల - జూన్ 24, మధ్యాహ్నం 3 గంటలకు
  • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.200) జులై కోటా -జూన్ 24, ఉదయం 10 గంటలకు
  • టీటీడీ స్థానిక ఆలయాల్లో సేవల టికెట్లు (జులై కోటా)- జూన్ 25, ఉదయం 10 గంటలకు

Whats_app_banner