Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో… పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. వేసవి సెలవులు ఉండటంతో అన్ని రాష్ట్రాల నుంచి శ్రీవారి భక్తులు దర్శనానకిి తరలివస్తున్నారు. త్వరలోనే పిల్లలకు సెలవులు కూడా ముగియనున్నాయి. దీంతో ఈలోపే తిరుమలకు వెళ్లేందుకు చాలా మంది భక్తులు సిద్ధమవుతున్నారు.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు(శుక్ర, శని, ఆదివారం తేదీలు)వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది.
శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది.ఆయా తేదీల్లో శ్రీవారి దర్శనానికి సుమారు 30 - 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే...బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది.క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
మే 25వ తేదీన 83,866 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 44,479 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. రూ. 4.15 కోట్లు హుండీ కానుకలు వచ్చాయి. కృష్ణ తేజ్ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూలైన్ ఉంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.