Kurnool Tragedy: కర్నూలు జిల్లాలో విషాదం…అనుమానంతో భర్త వేధింపులు, తాళలేక ఆత్మహత్య చేసుకున్న భార్య
Kurnool Tragedy: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా అత్త, ఆడపడుచుల వేధింపులతో కూడా పెరిగాయి. వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.
Kurnool Tragedy: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనీలో జరిగింది. ఆదోనిలోని అమరావతి నగర్‌లో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అదోని పట్టణంలోని అమరావతి నగర్‌లకు చెందిన శ్రీనివాసులకు, వాల్మీకినగర్‌కు చెందిన పావనికి 2021లో పెద్దలు పెళ్లి చేశారు.
శ్రీనివాసులుకు ఇది రెండో సంబంధం. వారికి ఎనిమిది నెలల కుమార్తె కావ్య ఉంది. శ్రీనివాసులు వాటర్ వర్క్స్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలోకి అనుమానం పెనుభూతమై వచ్చింది. భార్య పావనిపై భర్త శ్రీనివాసులు అనుమానం పెంచుకున్నాడు.
దీంతో అప్పటి నుంచి పావనికి భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ప్రతిరోజూ వేధిస్తునే ఉన్నాడు. దీనితోడు మహిళలుగా తోడుండాల్సిన అత్త లక్ష్మి, ఆడపడుచు సుశీలమ్మ కూడా భర్త వేధింపుల్లో భాగమై వేధించడం ప్రారంభించారు. దీంతో పావని తీవ్ర మనోవేదనకు గురయింది. ఒక్కోసారి భార్యను శ్రీనివాసులు కొట్టేవాడు కూడా. తీవ్ర మనస్తాపానికి గురైన పావని ఇక ఈ వేధింపులు భరించలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొంత సేటికి దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులు, లక్ష్మి, సుశీలమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
బాలికను అపహరించిన యువకుడిపై పోక్సో కేసు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లి గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామానికి చెందిన అభిలాష్ అనే యువకుడి మాయమాటలు నమ్మి అతడితో వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను ఎందుకు వెళ్లావంటూ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆ బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మిగునూరు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. బాలికను తీసుకెళ్లిన అభిలాష్ అనే యువకుడిపై పోక్సో యాక్ట్, కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం తెలిపారు.