Chandrababu :ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, వైసీపీ పాలనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu : ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే, వైసీపీ పాలనలో అమరావతి వెలవెలబోతుందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.
Chandrababu : సీఎం జగన్ తన స్వార్థం కోసం రాజధానిని నాశనం చేసి, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన 'రా...కదలి రా' బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఏపీని మళ్లీ కోలుకోలేని స్థితిలో రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలన్నారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే, జగన్ పాలనలో అమరావతి వెలవెలపోతోందని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కృష్ణా జిల్లా వాసులు ఉంటారన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో జిల్లా వాసులు టాప్ అన్నారు.
నిద్ర లేని రాత్రులు గడిపాం
ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదని చంద్రబాబు విమర్శించారు. అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకే నష్టం కలుగుతుందని, కానీ దుర్మార్గుడి పాలనలో కోలుకోలేని నష్టం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో కూడా నిద్ర లేని రాత్రులు గడిపామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే టీడీపీ ఆకాంక్ష అన్నారు. 25 ఏళ్ల క్రితం ఐటీ అనే ఆయుధాన్ని మన పిల్లలకు అందించానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే తనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందన్నారు.
టామాటాకి, పొటాటోకి తేడా తెలియని సీఎం
తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈసారి వైసీపీ ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్లే అవుతుందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వ్యవసాయ శాఖను మూసేశారని, ధాన్యం రైతులు దగాపడ్డారన్నారు. అప్పుల్లో ఏపీ రైతులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రైతుల బతుకులు బాగుపడాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలన్నారు. మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుదన్నారు. అమరావతి రాజధాని చేసినప్పుడు మద్దతిచ్చిన జగన్ .. ఆ తర్వాత మాటమార్చారన్నారు. 3 రాజధానులంటూ మూడు ముక్కలాటలు ఆడారని విమర్శించారు. ప్రధాని మోదీ అమరావతి రాజధానికి ఫౌండేషన్ వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీకి రాజధాని అంటే చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. జగన్ కు టమాటాకి, పొటాటోకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు.