Tirumala Ugadi Srirama navami Utsav : తిరుమలలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 17 నుంచి 19 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు-tirumala temple krodhi nama ugadi 2024 sri rama navami utsav celebration ttd released schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Ugadi Srirama Navami Utsav : తిరుమలలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 17 నుంచి 19 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు

Tirumala Ugadi Srirama navami Utsav : తిరుమలలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 17 నుంచి 19 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు

Bandaru Satyaprasad HT Telugu
Mar 30, 2024 05:46 PM IST

Tirumala Ugadi Srirama navami Utsav : తిరుపతిలో ఏప్రిల్ 17 నుంచి 19 వరకు కోదండ రామాలయంలో శ్రీ రామనవమి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

తిరుమల
తిరుమల

Tirumala Ugadi Srirama navami Utsav : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సర ఉగాది (Krodhi Nama Ugadi 2024)ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం ఆలయం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి స్వామి వారు ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ‌ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన(Tiurmala Arjita Seva) అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ(TTD) రద్దు చేసింది.

తిరుపతి శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ రామనవమి(Sri Rama Navami 2024) సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుంచి 9 గంటలకు సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారని టీటీడీ ప్రకటించింది.

ఏప్రిల్ 18న సీతారాముల కల్యాణం

ఏప్రిల్ 18న ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుంచి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం(Sitarama Kalyanam) వేడుకగా జరుగనుంది. రూ.1000 చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 19న శ్రీరామ పట్టాభిషేకం

ఏప్రిల్ 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని నరసింహతీర్థం నుంచి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం(Sri Rama Pattabhishekam) చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై ఆంజనేయస్వామి వారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20న ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 21 నుంచి 23 వరకు తెప్పోత్సవాలు

శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు(Kodandarama Teppotsavam) ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

సంబంధిత కథనం