Tirumala Darshan Tickets : ఆగస్టు నెలకు తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు - మే 18 నుంచే బుకింగ్స్ , ఇవిగో ముఖ్య తేదీలు
Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. ఆగస్టు కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.
Tirumala Srivari Arjitha Seva Tickets 2024: ఆగస్టు మాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటా షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. మే 18వ తేదీన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొంది.
శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మే 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 21న అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు….
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల
తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
మే 27న శ్రీవారి సేవ కోటా విడుదల
మే 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది..
టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. మే 25వ తేదీ నుండి కళాశాలలో దరఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్ 12వ తేదీ వరకు స్వీకరిస్తారు.