Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే 2.25 లక్షల రూ. 300 దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందారు. డిసెంబరు 22 నుంచి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లు జారీ చేయనున్నారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా 4,23,500 టోకెన్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నామని టీటీడీ తెలిపింది.
తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు ఏర్పాటుచేస్తారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 19వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
డిసెంబరు 19న ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది.
సంబంధిత కథనం