Vaikunta Ekadashi 2023 : వైకుంఠ ఏకాదశి.. విష్ణువుకు ఎందుకు ప్రీతికరమైనదంటే..
Vaikunta Ekadashi 2023 : సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. వీటిలో వైకుంఠ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 2, 2023వ తేదీన వస్తుంది. అన్ని ఏకాదశులలో.. వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రత్యేకతనిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Vaikunta Ekadashi 2023 : హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి, ద్వాదశులకు చాలా ప్రత్యేకత ఉంది. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము తిథులలో పదకొండవ తిథి ఏకాదశి. ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసము ఆచరించి మహావిష్ణువును పూజిస్తారో.. వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి నవగ్రహ పీడలు తొలగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రతీ మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రతీ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే మార్గశిర మాసములో శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా మోక్ష ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి - స్థితి - లయ కారకుడైన శ్రీమన్నారాయణునికి ప్రీతి పాత్రమైన సుదినము కూడా ఇదే.
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మ ముహూర్తకాలము. ఆ పిదప వచ్చే శుద్ధ ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ఆషాఢ శుద్ధ (తొలి) ఏకాదశి నాడు 'జగద్రక్షణ చింతన' యను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొని.. సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగాన్ని ఈ వైకుంఠ ఏకాదశినాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్తకాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం కావడంతో దీనికి 'ముక్కోటి ఏకాదశి' అని కూడా పేరు.
సృష్ట్యాదిలో మధు
కైటభులనే రాక్షసులను సంహరించిన శ్రీమన్నారాయణుడు.. వారికి మోక్షమునివ్వాలని.. వారిని ఈ ఏకాదశినాడు ఉత్తర ద్వారము నుంచి శ్రీవైకుంఠమును పొందించినట్లు పురాణ గాధ. ఉత్తరద్వారము (తరించు ద్వారము) నుంచి మోక్షమును ప్రసాదించినందుకు ఈ ఏకాదశికి 'మోక్షదా' ఏకాదశి అని కూడా పేరు ఉంది.
పూర్వం దక్షిణ భారతంలోని పాండ్య దేశపు రాజయిన వల్లభరాయుని ఆస్థానంలో పరతత్వ నిర్ణయం చేసి మహాభక్తునిగా గజారోహణ సమ్మానాన్ని పొందుచున్న పెరియాళ్వారు (విష్ణుచిత్తుల)ల వైభవాన్ని చూడడానికై.. శ్రీ భూనీళా సమేతుడై గరుడ వాహనంపై శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన పవిత్ర దినంగా కూడా చెప్తారు. ఆ స్వామిని కీర్తిస్తూ శ్రీ పెరియాళ్వారులు పల్లాండు పాడిన పర్వదిన కూడా ఇదే. ఇంతటి పవిత్రమైన శ్రీ వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వారంలో గరుడవాహనంపై వేంచేసియున్న శ్రీమన్నారాయణుని ఎవరైతే సేవిస్తారో వారు పునర్జన్మలేనివారై దుర్లభమైన పరమపదాన్ని పొందుతారని శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం బోధిస్తోంది.
సంబంధిత కథనం