Tirumala Leopard : తిరుమల నడకదారిలో మళ్లీ చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు!-tirumala news in telugu leopard spotted in alipiri footpath way devotees be alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Leopard : తిరుమల నడకదారిలో మళ్లీ చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు!

Tirumala Leopard : తిరుమల నడకదారిలో మళ్లీ చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు!

Bandaru Satyaprasad HT Telugu
Dec 20, 2023 04:36 PM IST

Tirumala Leopard : తిరుమల నడక దారిలో చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది. అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు అంటున్నారు. దీంతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు.

తిరుమలలో చిరుత సంచారం
తిరుమలలో చిరుత సంచారం

Tirumala Leopard : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అయితే ఈ తరుణంలో శ్రీవారి భక్తులను చిరుత భయం వీడడంలేదు. అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత ప్రత్యక్షం అయింది. టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా చిరుతల బెడద తప్పడంలేదు. తాజాగా అలిపిరి నడక మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద చిరుత భక్తులకు కనిపించింది. వారం రోజులుగా ఇదే ప్రాంతంలో చిరుత పలుమార్లు కనిపించిందని భక్తులు అంటున్నారు. దీంతో టీటీడీ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో భక్తులను గుంపులుగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. గతంలో నడకమార్గంలో ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంంధించిన విషయం తెలిసిందే.

టీటీడీ అలర్ట్

కొన్ని రోజుల క్రితం తిరుమల నడక మార్గంలో చిరుత ఓ బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బాలిక చిరుత దాడిలో మృతి చెందింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించారు. దీంతో చిరుతల సమస్య తప్పిందని భక్తులు భావించారు. కానీ తాజాగా మరో చిరుత నడకమార్గంలో ప్రత్యక్షం అయ్యింది. భక్తుల రక్షణకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక మార్గంలో రాత్రి 10 గంటల దాటాక భక్తులను అనుమతించడంలేదు. ఉదయం 6 గంటల తర్వాతే నడకదారిలో అనుమతిస్తున్నారు. 12 ఏళ్ల లోపు పిల్లల్ని నడక మార్గంలో మధ్యాహ్నం 2 తర్వాత అనుమతించడంలేదు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గుంపులుగా పంపిస్తున్నారు. భక్తులకు చేతి కర్రల్ని పంపిణీ చేస్తున్నారు.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం

ఈ నెల 23వ తేదీ వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని, జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని టీటీడీ ప్రకటించింది. వైష్ణవాలయాల సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠద్వారం 10 రోజులు తెరిచి భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి డిసెంబ‌రు 22వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి తిరుప‌తిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంట‌ర్ల ద్వారా స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామ‌ని టీటీడీ జేఈవో స‌దా భార్గవి తెలిపారు.

Whats_app_banner