TTD : మే 31 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు-tiruchanoor padmavathi ammavari teppotsavams 2023 start from 31st may 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : మే 31 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

TTD : మే 31 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

HT Telugu Desk HT Telugu
May 19, 2023 03:13 PM IST

Padmavathi Ammavari Teppotsavam 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను మే 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది.

పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు (twitter)

Tiruchanoor Padmavathi Ammavari Teppotsavam 2023 Updates: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ తెప్పోత్సవాలు మే 31 వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ ఉత్సవాల్లో శ్రీ అలిమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.

మే 31వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. అమ్మవారికి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు గజవాహనం, జూన్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. మరోవైపు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం