AP Telangana Floods : ఏపీ, తెలంగాణలో భారీ వరదలు.. కేంద్రం సాయం రూ.3,300 కోట్లు
AP Telangana Floods : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దీంతో కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలపై వరదలు ప్రభావం చూపగా.. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలపై ప్రభావం చూపాయి. పదులు సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీంతో కేంద్రం సాయం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు ప్రకటించింది.
రెండు రోజులుగా..
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రోజులుగా పర్యటించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కేంద్రమంత్రితో కలిసి పర్యటించారు. పంటనష్టం, ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలను పర్యటించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో ఏరియల్ సర్వే..
శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లారు. వరద సహాయక చర్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్‌లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
నేను రైతు బిడ్డనే..
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చా. రైతులు ఎలా కష్ట పడతారో నాకు తెలుసు. వారం రోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి, కంద వంటి పంటలు దెబ్బతిన్నాయి. నాలుగైదు రోజుల్లో నీళ్లు పోతే వరి పంట చేతికొచ్చేది. రోజులతరబడి నీళ్లు ఉండటంతో పంట కుళ్లిపోయింది. ఈ వరదలు కౌలు రైతులకు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. పంట నష్టం వచ్చినా కౌలు రైతులు కౌలు చెల్లించాలి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చూశా. రైతులెవరూ ఆందోళన చెందవద్దు.. అండగా ఉంటాం' అని శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.