TDP Strategy: ఆంధ్రాపై ప్రభావం పడకూడదనే పోటీ నుంచి తప్పుకున్నారా?
TDP Strategy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం ముందు జాగ్రత్తతోనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 2019 ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
TDP Strategy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే ప్రతికూల ఫలితాలు ఆంధ్రాలో ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో టీడీపీ జత కట్టింది. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2018లో పోలైన ఓట్లలో మొత్తం ఓట్లలో మూడున్నర శాతం ఓట్లకు తెలుగుదేశం పార్టీ పరిమితం అయ్యింది.
2018 ఎన్నికల్లో 99 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 19స్థానాల్లో గెలుపొందింది. 6 స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. 34.54శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మరోవైపు అధికారాన్ని దక్కించుకున్న బిఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలుపొందింది. 47శాతం ఓట్లను దక్కించుకుంది.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 175 స్థానాల్లో పోటీ చేసినా 23స్థానాల్లో మాత్రమే గెలిచింది. వైసీపీ 151 స్థానాలను దక్కించుకుంది. టీడీపీ 39.17శాతం ఓట్లు, వైసీపీకి 49.55శాతం ఓట్లు వచ్చాయి. 2019లో ఏపీలో ఘోరమైన పరాజయం పాలవడానికి తెలంగాణ ఎన్నికలు కూడా ప్రభావం చూపించాయని టీడీపీ భావిస్తోంది.
గత ఎన్నికల్లో 3.51శాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఈసారి పోటీ చేసినా ఓటమి తప్పదనే అంచనాకు రావడంతోనే పోటీ నుంచి విరమించుకుందని చెబుతున్నారు. తెలంగాణలో ఓటమి పాలైతే ఏపీలో కూడా ఆ ప్రభావం ఉంటుందని టీడీపీ అనుమానించింది. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే పోటీ నుంచి సైలెంట్‌గా తప్పుకుంది.
మరోవైపు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో భాగస్వామి కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. కేసీఆర్‌తో జత కట్టే పరిస్థితులు లేకపోవడంతో కాంగ్రెస్‌తోనైనా సఖ్యతగా ఉండాలని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నుంచి పోటీ తప్పుకుని ఓటు చీలనివ్వకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అవకాశాలను మెరుగుపరచాలని భావించినట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా ఉనికిని ప్రశ్నార్థకం చేసుకున్నారనే వాదన కూడా లేకపోలేదు.