AP Investments : పారిశ్రామికాభివృద్ధిపై ఫోకస్..! ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీ, టాటా గ్రూప్ ఛైర్మన్ కు కీలక బాధ్యతలు!
రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్దికి తగిన సలహాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది.
ముఖ్యమంత్రి చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో - చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విజన్ 2047 రూపొందించే పనిలో పడింది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయనుంది.
అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామికానుంది. విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సమాలోచనలు చేశారు.