Online Betting : పండగపూట విషాదం.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
Online Betting : అతను ఎన్నో కలలతో చదువుతున్నాడు. పేరెంట్స్ కోరిక మేరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు. బెంగళూరులో మంచి లైఫ్. ఇంతలోనే ఓ చెడ్డ అలవాటు. అదే ఆన్‌లైన్ బెట్టింగ్. ఈ బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దసరా పండగ పూట తీవ్ర విషాదం జరిగింది. మదనపల్లె రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టాలపై పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తంబళ్లపల్లె మండలం దిగువ గాలిగుట్టపల్లెకు చెందిన నడిమింటి వెంకటరమణారెడ్డి కొడుకు.. ఎన్.పద్మనాభరెడ్డి (26)గా గుర్తించారు పోలీసులు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అయితే.. పద్మనాభరెడ్డి మృతికి కారణం ఆన్ లైన్ బెట్టింగ్ అని తెలుస్తోంది. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ.. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి రూ. 24 లక్షలు పొగిట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి.. పద్మనాభరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.
గంగాధర నెల్లూరులోనూ..
ఇటీవల గంగాధర నెల్లూరు జిల్లాలోనూ బెట్టింగ్ భూతం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నాగరాజురెడ్డి (61) తన కుటుంబంతో నివాసముండేవారు. ఆయన ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో మంచానికే పరిమితం అయ్యాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో ఆ కుటుంబం గుట్టుగా జీవనం సాగిస్తోంది.
తన కుమారుడు దినేష్‌ను చిత్తూరులో బీటెక్ చదివించేవారు. తన భార్య జయంతి (48)ని కొడుక్కి తోడుగా చిత్తూరు పంపించి, నాగరాజురెడ్డి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లీ కొడుకులిద్దరూ చిత్తూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగరాజురెడ్డి కుమార్తె సునీత (26) డిగ్రీ చదివి రాజస్థాన్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేది. మూడు నెలల కిందటే ఇంటికి వచ్చింది.
కుమారుడు దినేష్ ‘ఆన్‌లైన్ బెట్టింగ్’లకు బానిసయ్యాడు. రూ. 20 లక్షల వరకూ అప్పులు చేశాడు. లక్షల రూపాయలు బెట్టింగ్‌లో పోయినా మళ్లీ దాన్ని వదలక మరిన్ని అప్పలు చేశాడు. అయితే.. నాగరాజురెడ్డి ముగ్గురు అన్నదమ్ములూ ఇటీవల ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున ఆస్తులు వచ్చాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల కొడుకు అప్పలయ్యాడని తెలిసి నాగరాజురెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
కూతురు పెళ్లికి, ఇతర అవసరాలకు పనికొస్తాయనుకున్న రూ.20 లక్షలలో రూ.10 లక్షల వరకు కొడుక్కి సర్దుబాటు చేశారు. మరికొంత డబ్బులు కావాలని తండ్రితో దినేష్ గొడవ పడ్డాడు. అయితే సొంతింటిపై బ్యాంకు రుణం పొందాలని గత నెలరోజులుగా ప్రయత్నం చేసినా విఫలం అయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చివరికి బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది.
కుటుంబంలోని నలుగురూ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజురెడ్డి (61) శుక్రవారం రాత్రే మృతి చెందారు. ఆయన భార్య జయంతి (48), వారి కుమార్తె సునీత (26) శనివారం ఒకరి తరువాత ఒకరు మృతి చెందారు. కుమారుడు దినేష్ (23) చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.