Nizamabad : ఎంత విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య
Nizamabad : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఆన్ లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకొని.. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు సురేశ్ (55), హేమలత(50).. వారి కుమారుడు హరీశ్ (22) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. సురేశ్- హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్ లైన్ బెట్టింగ్‌లో మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నాడు.
దీంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో.. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వడ్డేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా హరీశ్.. దాదాపు రూ.20 లక్షలు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీలోనూ..
ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు ప్రయత్నించి చివరకు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. గంగాధర నెల్లూరు పట్టణంలోని ఎగవూరుకు చెందిన నాగరాజరెడ్డి(61)కి భార్య జయంతి (51) ,కుమార్తె సునీత(26), కుమారుడు దినేష్(23) ఉన్నారు. కొన్నేళ్ల కిందట నాగరాజరెడ్డి తనకున్న ఇంటి స్థలాన్ని అమ్మేసి.. చిత్తూరు కొంగారెడ్డిపల్లి (కేఆర్ పల్లి)లో అద్దెఇంట్లోకి కాపురం మార్చారు.
ఇంటి స్థలాలను అమ్మగా వచ్చిన డబ్బును దినేష్ కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కట్టి పోగొట్టుకున్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బులే కాకుండా.. అప్పలు చేసి బెట్టింగ్ కట్టాడు. ఈ విషయంపై కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో నాగరాజరెడ్డి గంగాధర నెల్లూరులోని సొంతింటికి వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం నాగరాజరెడ్డి వద్దకు భార్య జయంతి, కుమార్తె సునీత, కుమారుడు దినేష్ వచ్చారు. తరువాత ఏం జరిగిందో.. నలుగురు పురుగుల మందు తాగేసి కేకలు వేశారు.
ఆ అరుపులు విని చుట్టుపక్కలవారు వెళ్లారు. పరిస్థితిని గుర్తించి 108 అంబులెన్స్‌ను రప్పించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. వారందరినీ చీలాపల్లెలోని సీఎంసీ ఆస్పత్రికి ,అక్కడి నుంచి రాణీపేటలోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజరెడ్డి శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు.