Nellore District : నెల్లూరులో విషాదం... ఉరేసుకొని భార్య ఆత్మహత్య, ఆపై రైలు కిందపడి భర్త సూసైడ్-husband and wife commit suicide in nellore district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore District : నెల్లూరులో విషాదం... ఉరేసుకొని భార్య ఆత్మహత్య, ఆపై రైలు కిందపడి భర్త సూసైడ్

Nellore District : నెల్లూరులో విషాదం... ఉరేసుకొని భార్య ఆత్మహత్య, ఆపై రైలు కిందపడి భర్త సూసైడ్

HT Telugu Desk HT Telugu
Aug 11, 2024 09:22 AM IST

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. భర్త మద్యానికి బానిస కావటంతో భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే భార్య మరణవార్త తెలిసిన భర్త తీవ్రంగా చలించిపోయాడు. ఆ వెంటనే రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో విషాదం representative image
నెల్లూరు జిల్లాలో విషాదం representative image (image source unsplash.com)

నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాద ఘ‌ట‌న జ‌రిగింది. భ‌ర్త మ‌ద్యానికి బానిసై కుటుంబాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం, అప్పులు పాల‌వ్వ‌డంతో తీవ్ర‌ మ‌న‌స్తాప‌న‌కు గురైన భార్య ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో త‌న వ‌ల్లే త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చ‌లించిపోయి భ‌ర్త కూడా రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో అభంశుభం తెలియ‌ని ఇద్ద‌రు చిన్నారులు అనాథుల‌య్యారు.

ఈ విషాద ఘ‌ట‌న నెల్లూరు న‌గ‌రంలోని ఎన్‌టీఆర్ న‌గ‌ర్‌లో శ‌నివారం చోటు చేసుకుంది. ఎన్‌టీఆర్ న‌గ‌ర్‌కు చెందిన కె. నాగ‌రాజు (23), సురేఖ (19) నాలుగేళ్ల కింద‌ట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు. మొద‌టి కుమారుడికి మూడేళ్లు, రెండో కుమారుడికి 11 నెల‌లు. నాగ‌రాజు టైల్స్ ప‌నులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 

భ‌ర్త‌కు అండ‌గా ఉండేందుకు భార్య సురేష్ న‌గ‌రంలోని మాగుంట లేఅవుట్‌లోని ఓ బ్యూటీ పార్ల‌ర్‌లో బ్యూటీషియ‌న్‌గా ప‌ని చేసేది. అంత వ‌ర‌కు సంతోషంగా సాగే వీరి ప‌చ్చటి కాపురంలో 'మ‌ద్యం' చిచ్చు రేపింది. దీంతో వీరి కుటుంబంలో గొడ‌వులు ప్రారంభమయ్యాయి.

భ‌ర్త నాగ‌రాజు మద్యానికి బానిసైయ్యాడు. సంపాదించిన‌దంతా మ‌ద్యానికే వెచ్చించేవాడు. స‌రిపోక‌పోతే బ‌య‌ట అప్పులు చేసేవాడు. దాంతో కుటుంబ భారం మొత్తం సురేఖ‌పైనే ప‌డింది. మ‌ద్యం మానేయాల‌ని, అప్పులు చేయొద్ద‌ని చాలాసార్లు భ‌ర్త‌ను ప్రాధేయ‌ప‌డింది. కానీ ఫ‌లితం లేదు. భ‌ర్తలో ఎటువంటి మార్పు రాలేదు. మ‌ద్యానికి డ‌బ్బులు లేక‌పోతే భార్య‌తో గొడ‌వకు దిగేవాడు. పుట్టింటికి వెళ్లి డ‌బ్బు తీసుకురావాల‌ని భార్యపై ఒత్తిడి చేసేవాడు. ఈ క్ర‌మంలోనే భార్య‌, భ‌ర్త‌లిద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు పెరిగాయి.

ఒక‌వైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్తే ప‌ట్టించుకోక‌పోవ‌డం, మ‌రోవైపు ఇద్ద‌ర పిల్ల‌ల పోషణ మ‌ధ్య భార్య సురేఖ న‌లిగిపోయేది. కుటుంబానికి అండ‌గా ఉండాల్సిన భ‌ర్తే, బాధ్య‌తారాహిత్యంగా ఉండ‌టంతో ఏం చేయాలో తోచ‌క భార్య సురేఖ తీవ్ర మన‌స్తాపానికి చెందింది. దీంతో శ‌నివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కుటుంబ స‌భ్యులు, స్థానికులు గుర్తించి, సురేఖ‌ను వెంట‌నే న‌గ‌రంలోని రామ‌చంద్రారెడ్డి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా… అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. అయితే ప‌ని కోస‌మ‌ని బ‌య‌ట‌కు వెళ్లిన నాగ‌రాజుకు భార్య ఆత్మ‌హ‌త్య విష‌యం తెలిసింది. దీంతో ఆయ‌న హుటాహుటిన ఆసుప్ర‌తికి చేరుకున్నాడు. నాగ‌రాజుకు భార్య విగ‌తజీవిగా కనిపించింది. ల‌బోదిబోమంటూ ఏడ్చాడు. అయినా ఏం ఫ‌లితం భార్య అనంత లోకానికి వెళ్లిపోయింది.

త‌న వ‌ల్లే త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని… త‌న భార్య లేనిదే తాను లేన‌ని, తాను జీవించ‌లేన‌ని చలించిపోయాడు. వెంట‌నే ఆసుప‌త్రి ప‌క్క‌నే ఉన్న విజ‌య‌మ‌హ‌ల్ గేటు రైల్వే ట్రాప్‌పై రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో అభం శుభం తెలియ‌ని చిన్నారి కుమారులు అనాథుల‌య్యారు. 

సురేఖ ఆత్మ‌హ‌త్య స‌మాచారం తెలుసుకున్న బాలాజీన‌గ‌ర్ ఎస్ఐ విజ‌య శ్రీ‌నివాస్‌, నెల్లూరు ఎమ్మార్వో ఆసుప‌త్రికి చేరుకున్నారు. సురేఖ మృత దేహాన్ని ప‌రిశీలించారు. సురేఖ త‌ల్లి దీప్తి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు, ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే నాగరాజు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌ట‌న‌పై రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సురేఖ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కి త‌ర‌లించారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.